- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డాక్టర్లు కావలెను !
దిశ, న్యూస్‌బ్యూరో: లక్ష కేసులు వచ్చినా ట్రీట్‌మెంట్ చేయడానికి ప్రభుత్వాసుపత్రులు సిద్ధంగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి, వైద్యారోగ్య మంత్రి మొదలు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వరకు పదేపదే చెప్తూ ఉన్నా క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. డాక్టర్ పోస్టుల్ని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలనుకున్న ప్రభుత్వానికి ఆశించిన ఫలితాలు రావడంలేదు. కనీసం 50% పోస్టులకు కూడా నియామకం పూర్తికాలేదు. దీంతో మళ్ళీ ప్రయత్నాలు మొదలయ్యాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన చేరడానికి అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. తక్కువ కాలపరిమితి ఉండడం, కాంట్రాక్టు పద్ధతిలో చేరితో భవిష్యత్తులో రెగ్యులరైజ్ అవుతుందనే నమ్మకం లేకపోవడం, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేరడానికి ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి.
గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఏప్రిల్ నెల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డాక్టర్ పోస్టుల్ని భర్తీ చేసుకుందామనుకున్న రాష్ట్ర వైద్య విద్యా డైరెక్టర్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. పోస్టుల సంఖ్యకు తగినంతగా డాక్టర్లు ముందుకు రావడంలేదు. ప్రభుత్వ ప్రయత్నాలకు గండి కొడుతోంది. టిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ పోస్టుల్నిభర్తీ చేయడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని, కనీసం 50% పోస్టులకు కూడా అభ్యర్థులు ఆసక్తి చూపలేదని డీఎంఈ ఒక అంతర్గత్ నోట్ ఫైల్‌లో పేర్కొన్నారు.
గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డాక్టర్ పోస్టుల్ని ఒక సంవత్సరం కాలానికి రిక్రూట్ చేసుకోడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి జూన్ 2వ తేదీన (జీఓ నెం. 872) పాలనాపరమైన అనుమతి మంజూరైందని, దీని ఆధారంగా 499 పోస్టుల్ని భర్తీ చేసుకోడానికి నోటిఫికేషన్ కూడా వెలువడిందన్నారు. ఆ ప్రకారం సుమారు 13,090 దరఖాస్తులు వచ్చాయని, ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు, మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆ నోట్‌లో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ 50% పోస్టులు కూడా భర్తీ చేయలేకపోయామని, ఇప్పటికీ ఆ పోస్టుల్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ అవసరం మరింతగా ఉందని వివరించారు.
గాంధీ ఆసుపత్రి రిక్రూట్‌మెంట్‌కు ఆసక్తి కరువు
టిమ్స్ పరిస్థితి ఇలా ఉంటే గాంధీ ఆసుపత్రి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నాలుగు నెలల కాలానికి ఇచ్చిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు పెద్దగా స్పందన రాలేదని డీఎంఈ ఆ నోట్‌లో పేర్కొన్నారు. కేవలం 19 పోస్టుల్ని మాత్రమే భర్తీ చేయగలిగామని, మిగిలినవాటికి అభ్యర్థులు ఆసక్తి కనబర్చలేదని వివరించారు. దీంతో ప్రభుత్వం నాలుగు నెలల కాలాన్ని ఒక సంవత్సర కాలానికి పొడిగించింది. అయినా జూలై 4వ తేదీ వరకు పెద్దగా స్పందన రాలేదు.
మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో 1:5 నిష్పత్తిలో టిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లోని డాక్టర్ పోస్టుల భర్తీకి రెండవ విడత కార్యక్రమం మొదలైంది. అప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలు ఉన్నవారిని ఫిల్టర్ చేయడం పూర్తయింది. తొలి విడతలో కాంట్రాక్టు పద్ధతిలో జరిగే రిక్రూట్‌మెంట్ కోసం వచ్చిన (జూలై 3న) దరఖాస్తుల్లో అర్హులైన అభ్యర్థులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసుకోడానికి రెండవ విడత ప్రక్రియను మొదలుపెట్టారు. మొదటి విడతలో ఎంపిక కాని అభ్యర్థులను ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోడానికి జూలై 4వ తేదీన కసరత్తు నిర్వహించారు. త్వరలో కాంట్రాక్టు పద్ధతిలోనివారు టిమ్స్ ఆసుపత్రిలో, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఎంపికైనవారు గాంధీ ఆసుపత్రిలో విధుల్లో చేరనున్నారు.
మూడు రోజుల క్రితమే సుమారు 60 మంది నర్సులు కాంట్రాక్టు పద్ధతిలో అయితే మాత్రమే ఒప్పుకుంటామని, కానీ ప్రభుత్వం బలవంతంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేసుకుంటే తాము ఒప్పుకోబోమని డీఎంఈ కార్యాలయంలో ధర్నా చేశారు. ఇది ఇంకా పూర్తిగా సద్దుమణగకముందే డాక్టర్ల పోస్టులకు సైతం పెద్దగా ఆసక్తి లభించలేదు. కేవలం నాలుగు నెలల వ్యవధి కోసం మాత్రమే డాక్టర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొనడంతో ముఖం చాటేశారు. కరోనా పేషెంట్లకు వైద్య సేవలందించడానికి కేవలం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నాలుగు నెలల కాలానికే అయితే తమకు ఆ ఉద్యోగాలే అవసరం లేదని ఒక అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఇంత రిస్కు తీసుకుని కరోనా పేషెంట్లకు సేవ చేసినా నాలుగు నెలల తర్వాత మళ్ళీ కొత్త కొలువును వెతుక్కోవాల్సిందేగదా అంటూ ప్రస్తుతం పనిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రిలో కొనసాగడానికే మొగ్గుచూపారు.