వారియర్స్ తొలి విజయం

by Shyam |   ( Updated:2020-08-20 11:56:52.0  )
వారియర్స్ తొలి విజయం
X

దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2020 సీజన్ తొలి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుపై ఓడిపోయిన గయానా అమెజాన్ వారియర్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం రాత్రి (ఇండియాలో గురువారం ఉదయం) జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాట్రియట్స్‌పై ఘన విజయం సాధించింది. ఒకానొక దశలో ఓటమి వైపు వెళ్తున్న జట్టును షిమ్రోన్ హిట్‌మెయర్ (Hitmayor)అర్ధ సెంచరీ బాది ఒంటి చేత్తో విజయతీరానికి చేర్చాడు.

టాస్ ఓడి.. బ్యాటింగ్‌లో విఫలమై..

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పాట్రియట్స్ జట్టు (Patriots Team) కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగలింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన క్రిస్ లిన్ (Chris linn) , రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఒక బౌండరీ, సిక్స్ బాది మంచి ఊపు మీద కనిపించినా, ఇమ్రాన్ తాహిర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికి గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి లిన్ (16) పెవీలియన్ చేరాడు.

అప్పటి వరకు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్న మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ బ్యాట్ (Evin Luies) ఝులిపించాడు. 18 బంతుల్లో 30 పరుగులు చేసిన లూయీస్ (30) గ్రీన్ బౌలింగ్‌లో కీపర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక కీమో పాల్ బౌలింగ్ ప్రారంభించిన తర్వాత పాట్రియట్స్ వికెట్లు (Wickets) వరుసగా కూలిపోయాయి. బెన్ డంక్ (29), కెప్టెన్ ఎమ్రిత్ (17) తప్ప మిగిలిన వాళ్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో పాట్రియట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేసింది. వారియర్స్ జట్టులో కీమో పాల్ (Khimo paul) 4 వికెట్లు తీసి పాట్రియట్స్ జట్టు పతనానికి కారణమయ్యాడు.

రాణించిన హిట్‌మెయిర్..

130 పరుగుల విజయ లక్ష్యం (Target)తో బ్యాటింగ్ ప్రారంభించిన గయానా అమెజాన్ వారియర్స్ (Gayana amazon warriors team)జట్టు కేవలం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (10), చందరపాల్ హేమరాజ్ (19) నిరాశపరిచినా, షిమ్రోన్ హిట్‌ మెయర్ అద్భుతంగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా హిట్ మెయర్ బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లో 71 పరుగులు చేశాడు. కాగా, హిట్ మెయర్‌ (Hitmayor)కు సరైన తోడు లభించలేదు. వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవీలియన్ చేరారు.

చివర్లో హిట్ మేయర్ కూడా అవుటవడంతో వారియర్స్ విజయంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కానీ గ్రీన్, షెపర్డ్ మరో వికెట్ కోల్పోకుండా కావల్సిన పరుగులు చేశారు. పాట్రియట్స్ జట్టు కెప్టెన్ ఎమ్రిత్ మూడు వికెట్లు తీసినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. ఈ విజయంతో వారియర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు వికెట్లు తీసిన కీమో పాల్ ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

స్కోర్ బోర్డు..

సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాట్రియట్స్ బ్యాటింగ్..

క్రిస్ లిన్ 16, ఎవిన్ లూయీస్ 30, నిక్ కెల్లీ 5, దినేష్ రామ్‌దిన్ 9, బెన్ డంక్ 29, జహ్‌మర్ హామిల్టన్ 2, రయాద్ ఎమ్రిత్ 17, డొమినిక్ డ్రేక్స్ 8, ఇష్ సోథి 4 నాటౌట్, జాన్ రస్ జగ్గేసర్ 0 నాటౌట్, మొత్తం 8 వికెట్ల నష్టానికి 127.

కీమో పాల్ 4, ఇమ్రాన్ తాహిర్ 2, గ్రీన్ 1 వికెట్ తీశారు.

గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటింగ్..

బ్రెండన్ కింగ్ 10, చందర్‌పాల్ హేమరాజ్ 19, షిమ్రోన్ హెట్‌మెయర్ 71, రాస్ టేలర్ 9, నికోలస్ పూరన్ 0, రూథర్ ఫోర్డ్ 10, కీమో పాల్ 0, గ్రీన్ 1 నాటౌట్, షెపర్డ్ 4 నాటౌట్. మొత్తం 17 ఓవర్లలో 131

ఎమ్రిత్ 3, డ్రేక్స్ 1, కొర్టెల్ 1 వికెట్లు తీశారు.

Advertisement

Next Story