ఆ ప్రాంతాల్లో రోజుకు 3సార్లు స్ప్రే తప్పనిసరి

by Sridhar Babu |

దిశ, కరీంనగర్ : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున బాధితుల నివాస ప్రాంతాల్లో రోజులకు మూడు సార్లు స్ప్రేయింగ్ చేయించాలని పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం రామగుండం బల్దియాలో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..పాజిటివ్ వచ్చిన వారి నివాస ప్రాంతాల్లో కిలో మీటర్ పరిధి మేర ఆంక్షలు విధించామన్నారు. ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు ఇళ్లకే పంపిణీ చేయాలన్నారు. సరుకులు పంపిణీ చేసే వారికి ప్రత్యేకంగా పాసులు జారీ చేయాలన్నారు. నిరంతర పారిశుధ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించామని కలెక్టర్ తెలిపారు.తాగునీటి సరఫరా, అవసరమైన వైద్యం అందించేందుకు వీలుగా వైద్యాధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ ప్రాంత వాసులకు అవగాహన కల్పించాలన్నారు. ఒకవేళ ఎవరైనా మరణిస్తే తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వృద్ధుల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఒంటరిగా ఉన్న వారికి అవసరమైన మందులు, నిత్యావసరాలు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. రోజుకు 3సార్లు రసాయనాలను పిచికారీ చేయాలన్నారు. రివ్యూ అనంతరం కరోనా సోకిన వ్యక్తులు నివాసముండే కాలనీలను ఆమె సందర్శించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రామగుండం మేయర్ అనిల్ కుమార్, రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి సుధాకర్ పాల్గొన్నారు.

Tags: carona, lockdown, peddapalli collecter siktha patnaik, 3times spray, ramagundam

Advertisement

Next Story

Most Viewed