కరోనా అడ్డాగా మారిన కర్నూలు గడ్డ!

by srinivas |
కరోనా అడ్డాగా  మారిన కర్నూలు గడ్డ!
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయి. ప్రధానంగా కర్నూలు జిల్లాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఆందోళనరేకెత్తిస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 1259 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. కేవలం కర్నూలు జిల్లాలోనే 332 కేసులు నమోదై దేశంలోనే వేగంగా కరోనా సోకుతున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.

ఏప్రిల్ 2వ తేదీ నాటికి కర్నూలు జిల్లాలో కేవలం నాలుగంటే నాలుగే కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు గల జిల్లాగా కర్నూలు రికార్డులకెక్కింది. ఆ జిల్లాలో అడుగుపెట్టాలంటే బెంబేలెత్తిపోయేంతలా కరోనా విస్తరిస్తోంది. సీఎంను కర్నూలులో అడుగుపెట్టమని ప్రతిపక్షనేతలు సవాల్ విసిరేంత తీవ్రంగా కరోనా ప్రబలింది.

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 332 కేసులు నమోదైతే.. 280 మంది జిల్లాలోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 43 మంది ఇప్పటి వరకు కరోనా బారినపడి చికిత్స తీసుకుని కోలుకుని సురక్షితంగా ఇళ్లకు చేరారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు. మృతుల్లో కూడా కర్నూలే అగ్రస్థానంలో నిలవడం విశేషం. నిన్న ఒక్కరోజే 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ కేసుల్లో కూడా కర్నూలు పట్టణం, ఆత్మకూరు, డోన్, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరులోనే మెజారిటీ ఉన్నాయి.

ఒకవైపు కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని సీఎం ప్రకటించారు. పరీక్షలు నిర్వహించడమే గొప్పవిషయమా? అని ప్రజలు మండిపడుతున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు సరే.. ఎన్ని కేసులు నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరుతున్నాయని కర్నూలు వాసులు నిలదీస్తున్నారు.

Tags: coronavirus, corona positive, covid-19, kurnool district, ap, health department

Advertisement

Next Story

Most Viewed