30 విమాన సర్వీసులకే అనుమతి

by Shyam |
30 విమాన సర్వీసులకే అనుమతి
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు విమాన సేవలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి 30 విమాన సర్వీసులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో 30% మేర మాత్రమే సాధారణ విమాన సర్వీసులు నడవనున్నాయి. ఇందులో ఆరు విమానాలు తిరుపతి – హైదరాబాద్ మధ్య నడిచేవే. 30 విమాన సర్వీసుల్లో.. 15 శంషాబాద్ నుంచి బయలుదేరేవి కాగా, మరో 15 ఇక్కడికి చేరుకునేవి. ఇవి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ తదితర విమానయాన సంస్థలకు చెందినవి. అన్నీ దేశీయ విమాన సర్వీసులే. తిరుపతి-హైదరాబాద్ మధ్య నడిచే విమానాలు మాత్రం మొత్తం ఆరూ ఇండిగోకు చెందినవే. ఉదయం 8.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట మధ్య ఈ విమాన సర్వీసులు నడుస్తాయి.

శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు విధిగా టికెట్లను దగ్గర ఉంచుకోవాల్సిందే. సైబరాబాద్ పోలీసు కమిషనర్.. క్యాబ్, టాక్సీ సర్వీసులకు 24 గంటల రాకపోకలకు అనుమతినిచ్చినా రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతున్నందునా ప్రయాణికులు మాత్రం విమానయానానికి సంబంధించిన ఆధారాలను దగ్గర ఉంచుకోవాలి. విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో ఈనెల 26 నుంచి కేవలం 20 శాతం విమాన సర్వీసులే నడవనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed