‘కులం’ అడ్డు గోడ.. ఒంటరైన మూడు కుటుంబాలు

by Sumithra |
cast-feeling
X

దిశ, కామారెడ్డి : భూ వివాదం విషయంలో కుల పెద్దలు మూడు కుటుంబాలను బహిష్కరించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. బహిష్కరణకు గురైన కుటుంబాలతో ఎవరు మాట్లాడినా, మంచి చెడులకు వెళ్లినా రూ.10 వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు తీర్మానం చేశారు.ఈ విషయంపై బాధితుడు రవీందర్ రెడ్డి తహశీల్ధార్‌కు ఫిర్యాదు చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఆకిటి రాంరెడ్డి, సావిత్రిలు భార్యాభర్తలు. వీరికి గ్రామంలో సుమారు 19 ఎకరాల భూమి ఉండడంతో పెద్ద అల్లుడు అకిటి రవీందర్ రెడ్డి సాగుచేస్తూ అత్తమామలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ భూమిలో ఒక ఎకరం 30 గుంటలు భూమి తమదంటూ బంధువులైన గుట్టకాడి మణెమ్మ కుమారులు స్వామి, సంజీవరెడ్డి, రంజిత్ రెడ్డిలు గత ఎనిమిది నెలల కిందట అకిటి రవీందర్ రెడ్డితో పాటు అత్తమ్మ సావిత్రిపై దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. దీంతో రవిందర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పెద్దల సమక్షంలో మాట్లాడుకునేందుకు వెళ్లగా కులపెద్దలు స్వామి, సంజీవరెడ్డిలు సైతం రంజిత్ రెడ్డిలకు సపోర్ట్‌గా మాట్లాడారు.

అంతేకాకుండా వారికి ఒక ఎకరం 30 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని లేకుంటే రూ.లక్ష జరిమానా కట్టాలని తీర్మానం చేశారు. అయితే, రవీందర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించి లక్ష రూపాయలు జరిమానా కట్టేందుకు సిద్ధమయ్యాడు. జరిమానా కట్టేందుకు వెళ్లిన రవీందర్ రెడ్డిని కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించి కులస్థులు తీర్మానం చేశారు. రవీందర్ రెడ్డి కుటుంబంతో పాటు మామ రాంరెడ్డి, తమ్ముడు శ్రీకాంత్ రెడ్డిల కుటుంబాలను కులస్తులు బహిష్కరించారు. గ్రామంలో కులస్తులెవరూ తమ కుటుంబాలతో మాట్లాడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా వీరితో మాట్లాడినా, మంచి చెడుకు వెళ్లినా పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని చెప్పడంతో రవీందర్ రెడ్డి నడుపుతున్న ఫెర్టిలైజర్ దుకాణంలో ఎవరూ మందులు కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన రవీందర్ రెడ్డి, రాంరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కుటుంబాలు తమకు న్యాయం చేయాలని తాడ్వాయి తహశీల్దార్‌కు, ఎస్సై కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేకూర్చాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Next Story