తెలంగాణలో 28 వేల మంది స్కావెంజర్లు కావలెను

by Anukaran |
తెలంగాణలో 28 వేల మంది స్కావెంజర్లు కావలెను
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల నుంచి 9 ,10 తరగతులను భౌతికంగా నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 28 వేల మంది స్కావెంజర్లు అవసరమవుతున్నారు. స్కూళ్లను పరిశుభ్రం చేసే బాధ్యతలను స్థానిక సంస్థలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా, పారిశుధ్య కార్మికులు సిద్ధంగా లేరు. దీంతో పాఠశాలలను శుభ్రం చేయాల్సిన భారం ఉపాధ్యాయులు, విద్యార్థులపైనే పడనుంది. క్లాసుల నిర్వాహణతో పాటు పరిశుభ్రతను వాళ్లిద్దరే స్వయంగా నిర్వహించుకోవాల్సి వస్తోంది.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న 28 వేల మంది అవుట్ సోర్సింగ్ సర్వీస్ పర్సన్స్ (స్కావెంజర్లు)ను తొలగించింది. పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ బాధ్యతలను స్థానిక జీపీ, మున్సిపల్ కార్మికులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

తాజాగా జీపీ కార్మికులు కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమ పనులు నిర్వహించేందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని, స్కూళ్లలోనే తామే పనులు చేయాలంటే సాధ్యం కాదంటూ గ్రామ పంచాయతీ కార్మికులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది జీపీ కార్మికుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారి పనిభారం కూడా ఇప్పుడున్న వారిపైనే పడుతోంది. అదనంగా స్కూళ్లలో పరిశుభ్రత పనులంటే సాధ్యం కాదని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ స్పష్టం చేస్తోంది.

ప్రభుత్వ స్కూళ్లలో పని చేసే ఒక్కో సర్వీస్ పర్సన్‌కు నెలకు రూ.2,500 ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడటం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కనీస అవసరమైన విద్య కోసం ముందుకు రాకపోవడం బాధాకరమని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్కూళ్లు నిర్వహిస్తున్న ఈ నాలుగు నెలల మేరకైనా ప్రభుత్వం స్కావెంజర్లను నియమించాలని కోరుతున్నారు. మొత్తంగా అటు స్కూళ్లలో స్కావెంజర్లు నియమించకపోవడం, ఇటు జీపీ కార్మికులు పనులు చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆ పనులు ఎవరు చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేసే కుట్రలో భాగంగా నేతలు ఇలా చేస్తున్నారని ఆరోపణలూ పెరుగుతున్నాయి.

ఒకటో తేదీ నాటికే స్కావెంజర్లను నియమించాలి

పాఠశాలలను తెరవడానికి ముందే సర్వీస్ పర్సన్స్ నియమించడం ప్రభుత్వ బాధ్యత. స్కావెంజర్లు నియమించకుండా భౌతిక తరగతులను నిర్వహించడం కూడా వృథా ప్రయాసే. ప్రభుత్వం చెబుతున్న విధంగా జీపీ, మున్సిపల్ కార్మికులు చేయాలన్న నిబంధన క్షేత్రస్థాయిలో సాధ్యపడటం లేదు. ఇప్పటికే ప్రిన్సిపాళ్లు, ఇతర ఉపాధ్యాయులు స్కూళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వం బాధ్యతలను తప్పించుకోకుండా ఫిబ్రవరి ఒకటికి ముందే సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలి. –మైస శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్

ప్రభుత్వ కుట్రలో భాగమయ్యే ప్రసక్తే లేదు

ఒక్కో వర్కర్ నాలుగు కంటే ఎక్కువ పనులు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే గ్రామ పంచాయతీ సిబ్బందిని నియమించారు. ఇప్పుడున్న జనాభా ప్రకారం సిబ్బంది సరిపోరు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్ల పనులను కూడా అప్పగించడంతో అదనపు భారం పడుతుంది. విద్యాశాఖ పరిధిలో ఉపాధి పొందుతున్న వారి కడుపు కొట్టే విధంగా ఉన్న ప్రభుత్వ కుట్రలో మేం భాగం కాదలుచుకోలేదు. –పాలడుగు భాస్కర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, జీపీ వర్కర్స్ యూనియన్

Advertisement

Next Story

Most Viewed