Hardik Pandya: హార్దిక్‌ పాండ్య గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌..

by Vinod kumar |   ( Updated:2023-10-21 22:05:42.0  )
Hardik Pandya: హార్దిక్‌ పాండ్య గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూ భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేవలం మూడు బంతులను మాత్రమే వేసి డగౌట్‌కు వెళ్లిపోయాడు. మిగతా ఓవర్‌ను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. ఆ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. హార్దిక్‌ విషయంలో ఆందోళన అవసరం లేదని తెలిపాడు. అయితే, తాజాగా బీసీసీఐ ప్రకటన ప్రకారం.. హార్దిక్‌ పాండ్య వచ్చే మ్యాచ్‌లో ఆడటం లేదు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో హార్దిక్‌ ఆడటం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అక్టోబర్ 29న లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సమయానికి జట్టుతోపాటు చేరతాడని వెల్లడించింది. హార్దిక్‌ గాయానికి సంబంధించి స్కానింగ్‌ తీసిన బీసీసీఐ వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గాయం పెద్దది కాకపోయినా.. విశ్రాంతి ఇవ్వడమే మేలని మేనేజ్‌మెంట్ భావించింది.

‘‘టీమిండియా వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సమయంలో గాయపడ్డాడు. స్కానింగ్‌ అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బీసీసీఐ వైద్యబృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా జరగనున్న మ్యాచ్‌లో హార్దిక్ ఆడటం లేదు. నేరుగా అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో పోరుకు లఖ్‌నవూ చేరుకుంటాడు’’ అని బీసీసీఐ ప్రకటన వెలువరించింది.

అసలేం జరిగిందంటే..

బంగ్లా ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్‌ రెండు బంతులు వేశాడు. మూడో బంతిని లిటన్‌ దాస్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడాడు. దీన్ని కుడి కాలితో ఆపే ప్రయత్నంలో హార్దిక్‌ చీలమండ బెణికింది. జారి కిందపడ్డ అతను తీవ్రమైన నొప్పితో కనిపించాడు. సరిగ్గా నిలబడలేకపోయాడు. చికిత్స అనంతరం బౌలింగ్‌ చేద్దామని హార్దిక్‌ ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. దీంతో మైదానాన్ని వీడక తప్పలేదు.

Advertisement

Next Story

Most Viewed