సంచలనం: వాలంటీర్ వ్యవస్థలో ఇదే మొదటిసారి 

by srinivas |
సంచలనం: వాలంటీర్ వ్యవస్థలో ఇదే మొదటిసారి 
X

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ విధులలో నిర్లక్ష్యం వహించిన కారణంగా శ్రీకాకుళం జిల్లా సోంపేట పరిధిలోని 19 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగించబడ్డారు. ఈ మేరకు గురువారం వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి వాలంటీరుకు కోవిడ్ లో నిర్వహించాల్సిన విధులను స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు.

ప్రతి వాలంటీరు తన పరిధిలోని 50 గృహాలను ప్రతి రోజూ విధిగా సందర్శించి ఏ ఇంటిలోనైనా కోవిడ్ లక్షణాలు ఉంటే తక్షణం తెలియజేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ సోంపేట సచివాలయం–1 లో 52 మంది వాలంటీర్లకు గానూ 15 మంది గైర్హాజరు అయ్యారని, అదేవిధంగా సోంపేట సచివాలయం–2 లో 28 మంది వాలంటీర్లకు గాను నలుగురు గైర్హాజరు అయినట్లు మండల తహశీల్ధారు రిపోర్టు చేసినట్లు ఆయన చెప్పారు.

కోవిడ్ సమయంలో విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా 19 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగించామని జాయింట్ కలెక్టర్ వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సచివాలయ కంట్రోల్ రూమ్ విధులు రేయింబవళ్ళు పకడ్బందీగా నిర్వహించాలని… ఏ వార్డు, గ్రామంలోనూ కరోనా లక్షణాలు ఉన్న ఏ వ్యక్తి ఉండరాదని… కరోనా లక్షణాలు ఉంటే విధిగా తెలియజేయాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు.

విధులు సక్రమంగా నిర్వహించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని విధుల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ యాజమాన్య చట్టం, ఎపిడమిక్ చట్టం ప్రస్తుతం అమలులో ఉన్న సంగతిని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా విధులను బాధ్యతతో నిర్వర్తించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

ఇటీవల ఏపీ సీఎం జగన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో వాలంటీర్ వ్యవస్థపై కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. విధులకు వరుసగా 6 రోజులు హాజరు కాకపోతే వారిని వెంటనే తొలగించాలని, 15 రోజుల్లో ఆ పోస్టును భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 19 వాలంటీరులను వెంటనే తొలగించినట్లు స్పష్టమవుతోంది. కాగా వాలంటీర్ వ్యవస్థ మొదలైన తర్వాత ఇంత మొత్తంలో… అది కూడా ఒకే పరిధిలో… వాలంటీర్లను తొలగించడం సంచలనంగా మారింది. వాలంటీర్లలో కలవరం మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed