50 ఏళ్ల వయస్సులో 12వ తరగతి పాస్

by Shyam |
50 ఏళ్ల వయస్సులో 12వ తరగతి పాస్
X

ఇలాంటి వార్తలు చాలా చూసుంటాం. ఎన్నిసార్లు చూసినా కానీ, వారి గురించి చదివేకొద్దీ మనలో స్ఫూర్తి పెరుగుతుంది. అందుకే ఇలా వయస్సును లెక్కచేయకుండా చదువు మీద ఆసక్తితో పరీక్షలు రాసి, పాసయ్యే వారి నుంచి ఇనిస్పిరేషన్ పొందడంలో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి 50 ఏళ్ల వయస్సులోనూ 12వ తరగతి పాసైన మేఘాలయాకు చెందిన ఓ మహిళ గురించి తెలుసుకుందాం.

సోమవారం రోజున మేఘాలయ బోర్డు హయ్యర్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ వారు 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అందులో ఉత్తీర్ణుల జాబితాలో 50 ఏళ్ల లాకైన్‌టివ్ సైమ్లే పేరు కూడా ఉంది. మేఘాలయలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన లాకైన్‌టివ్ 30 ఏళ్ల క్రితం చదువు మానేసింది. అంత విరామం వచ్చిన తర్వాత మళ్లీ చదువుకోవాలనే ఆశ, ఆసక్తి చాలా మందికి కలగదు. కానీ లాకైన్‌టివ్ అందరిలాంటి మహిళ కాదు. వయస్సును లెక్కచేయకుండా చదువును ప్రేమించి తాను అనుకున్నది సాధించింది. ఈ చదువును 12వ తరగతితోనే ఆపేయకుండా తనకు ఇష్టమైన ఖాసీ భాషలో డిగ్రీ పట్టా పొందాలని లాకైన్‌టివ్ ఆశపడుతున్నారు. తాను కచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నపుడు ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది.

ఇంతకీ ముప్పై ఏళ్ల క్రితం లాకైన్‌టిన్ చదువు ఎందుకు మానేసిందో తెలిస్తే, మరింత ఆదర్శం కలుగుతుంది. ప్రస్తుతం చాలా మంది పిల్లలకు ఉన్నట్లుగానే లాకైన్‌టిన్‌కు గణితం సబ్జెక్టు అంటే చాలా భయం. అప్పుడు అందులో ఫెయిల్ అవడంతో చదువు మానేసింది. తర్వాత 2008లో ఒక స్కూల్లో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ ఉద్యోగంలో చేరింది. అప్పుడే ఆమెకు మళ్లీ చదువుకోవాలన్న ఆశ కలిగిందట. దీంతో 2015లో గణితం సబ్జెక్టులేని కోర్సులో చేరి, ఇప్పుడు నెమ్మదిగా 12వ తరగతి పూర్తి చేసి అందరీ మన్ననలు పొందుతోంది.

Advertisement

Next Story

Most Viewed