రోడ్డుపైనే ఆవిరైన 12 ఏళ్ల బాలిక ప్రాణాలు

by vinod kumar |
రోడ్డుపైనే ఆవిరైన 12 ఏళ్ల బాలిక ప్రాణాలు
X

బీజాపూర్ : 12 ఏళ్ల బాలిక. పని కోసం వెతుక్కుంటూ ఛత్తీస్‌గడ్ బీజాపూర్ నుంచి తెలంగాణకు వలస వచ్చింది. ఓ మిరప తోటలో రెండు నెలలుగా పనిచేసింది. కానీ, లాక్‌డౌన్ పిడుగుతో ఆమె భవిష్యత్ ఒక్కసారిగా అంధకారమైంది. పనిచేసే చోట ఉండలేక.. ఇంటికి వెళ్లే సౌకర్యాల్లేక.. కాలినడకనే ఇంటికి ప్రయాణమై.. గమ్యం చేరకముందే ప్రాణాలొదిలింది. మూడు రోజులు నడిచి నడిచి మరో గంట నడిస్తే ఇళ్లు వస్తుందనగా.. ఊపిరి వదిలింది. 12 ఏళ్ల ప్రాయంలోనే ఆమెకు నూరేళ్లు నిండాయి.

బీజాపూర్‌ నుంచి తెలంగాణలోని ఓ గ్రామంలో మిరప తోటలో పనిచేసేందుకు జమ్లో మడ్కం(12) వలస వచ్చింది. కానీ, లాక్‌డౌన్‌ పొడిగించడంతో.. ఈ నెల 15న 11 మందితో కలిసి సొంతూరికి ప్రయాణం కట్టింది. కర్ఫ్యూ నిబంధనలతో జంకి హైవేల వదిలి అడవులు, కొండకోనలు దాటుతూ వెళ్లింది. మూడు రోజులు అలుపెరగకుండా నడిచింది. కడుపు నొప్పి, వాంతులు లెక్కచేయకుండా నడుస్తూనే ఉంది. కానీ, ఆమె కళ్లల్లోని సొంతిళ్లు మరో గంట ప్రయాణం చేస్తే వచ్చేంత దూరంలోనే శాశ్వతంగా కళ్లుమూసింది. పేదరికం, పౌష్టికాహారలోపం ఒకవైపు.. లాక్‌డౌన్, మూడు రోజుల ఏకబిగి నడక, ఆకలి, డీ హైడ్రేషన్ మరోవైపు కలిసి ఆ చిన్నారి వలస కూలీ ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ ఘటనపై తప్పెవరిది? శిక్ష ఎవరికి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags: lockdown, 12 years, migrant, telangana, chhattisgarh, died, walk

Advertisement

Next Story

Most Viewed