- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షట్‌డౌన్ దిశగా 108 సేవలు!
దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 108 సేవలు షట్‌డౌన్ దిశగా కదులుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 108 సేవల అధికారులు వింత పోకడలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108 సేవల సిబ్బందిని రాజధాని నగరమైన హైదరాబాద్‌కు కరోనా విధుల నిమిత్తం తరలిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అసలే ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా వాహనాలు వివిధ కారణాల వల్ల పనిచేయడం లేదు. తాజాగా 108 వాహనాల డ్రైవర్లు, సిబ్బందిని కరోనా డ్యూటీ పేరుతో నగరానికి పంపుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పక్క రాష్ట్రామైన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మండలానికో 108 వాహనం అందుబాటులో ఉంటే.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం ఐదారు మండలాలకు ఒక అంబులైన్స్ అందుబాటులో ఉంటుంది.
4 మండలాలకు ఒక్క అంబులెన్స్..
అత్యవసర సమయాల్లో ప్రజలకు త్వరితగతిన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ హయాంలో 108 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి 108 వాహనాలను ప్రారంభంలో ప్రతి రెండు మండలాలకు ఒకటి చొప్పున కేటాయించారు. కానీ, ప్రస్తుతం నాలుగు నుంచి ఆరు మండలాలకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంది. ఒక్కోసారి అది కూడా అందుబాటులో లేకపోవడంతో 30 కిలోమీటర్ల దూరం నుంచి 108 వాహనం రావాల్సి వస్తోన్నది. ఈలోపు అత్యవసరంగా అందాల్సిన చికిత్స అందక వారి ప్రాణాలు హరిమంటున్నాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితిదీ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగానికి పైగా 108 వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. నల్లగొండ జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాలు 19 ఉన్నాయి. ఇందులో ఒక్క వాహనాన్ని ఏదైనా మండలంలో వాహనం మరమ్మత్తులకు గురైతే అక్కడ వాడేందుకు ఎప్పుడూ రెడీగా పక్కన ఉంటుంది. దీంతో నల్లగొండ జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండేది కేవలం 18 వాహనాలు. అందులోనూ నిత్యం డీజిల్ కొరత, సిబ్బంది సెలవులు పెట్టడం, వాహనాలు మరమ్మత్తులకు రావడం వంటి కారణాలతో దాదాపు 8 వాహనాలు నిత్యం అందుబాటులో ఉండవు. ఇక సూర్యాపేట జిల్లాలో 108 అంబులెన్స్‌లు 12 ఉన్నాయి. యదాద్రి-భువనగిరి జిల్లాలో మరో 14 అంబులెన్స్‌లు ఉండగా, వీటిల్లోనూ సగానికి పైగా వాహనాలు రోజూ అందుబాటులో ఉండవు.
జిల్లా సిబ్బందిని హైదరాబాద్‌కు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసే 108 వాహన సిబ్బందిని 15 రోజుల చొప్పున డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి చింతపల్లి, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన 108 అంబులెన్స్‌లను, సిబ్బందిని హైదరాబాద్‌కు పంపారు. నార్కట్‌పల్లికి మరో మండలమైన శాలిగౌరారం వాహనాన్ని తీసుకొచ్చారు. శాలిగౌరారం మండలంతోపాటు మరో రెండు మూడు మండలాలకు 108 వాహన సేవలు లేకుండా పోయాయి. ఇప్పటికే యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు సంబంధించిన 108 వాహనం హయత్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో సేవలందిస్తోంది. దీనికితోడు అసలే హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి సిబ్బంది వెళ్లేందుకు వణికిపోతున్నారు. వారికి కనీసం మాస్కులు, శానిటైజర్లు, ప్రత్యేక డ్రెస్ వంటివేమీ అందించడం లేదు. కరోనా వైరస్ బాధితులను ఈ వాహనాల్లోనే తరలిస్తుండడం వల్ల వారికి సైతం కరోనా సోకే ప్రమాదం ఉంది.
హైదరాబాద్‌లో పనిచేసే సిబ్బంది డుమ్మా..
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య హైదరాబాద్‌లో అధికంగా ఉంది. అయితే అక్కడ 108 వాహనాల్లో పనిచేస్తోన్న సిబ్బందికి వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో సిబ్బంది భయపడిపోతున్నారు. కనీసం చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, మాస్కులు సైతం ఇవ్వడం లేదు. దీంతో సగానికి పైగా డ్రైవర్లు, సహాయక సిబ్బంది సెలువులు పెట్టి అటునుంచి అటే విధులకు డుమ్మా కొడుతున్నారు. కరోనా వైరస్ భయానికి తోడు సిబ్బందికి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఉద్యోగం పోతే పోయింది.. కనీసం ప్రాణాలైనా ఉంటాయన్న ఆశతో విధులు మానేస్తున్నారు. ఫలితంగా వివిధ జిల్లాల నుంచి 108 వాహనాలను హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లబోమని సిబ్బంది మొరాయిస్తే.. డ్యూటీలు మానేయండంటూ అధికారులు బెదిరిస్తున్నారు.
కరోనా వచ్చిన కానిస్టేబుల్‌తో డ్యూటీ..
నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు 15 రోజుల పాటు డిప్యుటేషన్‌పై ఓ 108 సిబ్బంది వెళ్లాడు. తాజాగా హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన కానిస్టేబుల్‌తో పాటే అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. గత వారం రోజుల క్రితమే 108 సిబ్బంది 15 రోజుల డిప్యుటేషన్ ముగియడంతో జిల్లాకు తిరిగొచ్చాడు. కానిస్టేబుల్‌కు పాజిటివ్ వచ్చినట్టు తాజాగా తెలియడంతో అతడు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. దీనిపై 108 ఉన్నతాధికారులు స్పందించడం లేదు.
tags: Nalgonda, Hyderabad, 108 Vehicle, Services, Staff, Drivers, Corona Effect