మానవ తప్పిదం లేని నర హత్య కేసు..

by Sumithra |   ( Updated:2021-09-25 08:35:33.0  )
మానవ తప్పిదం లేని నర హత్య కేసు..
X

దిశ, పరకాల: తప్ప తాగి వాహనం నడిపాడు. అంతేకాదు మద్యం బాటిల్ క్యాబిన్లో తన ముందు పెట్టుకొని మాటిమాటికి తాగుతూ వస్తున్నాడో ఏమో ఫుల్లుగా మద్యం మత్తులో వున్నాడు. ఓ ఇసుక లారీ డ్రైవర్ తాగిన మత్తులో లారీని నిర్లక్ష్యంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణం అయ్యాడు. అంతే కాదు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 18వ తేదీన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన నారబోయిన సైదులు(38) అనే ఇసుక లారీ డ్రైవర్ కాళేశ్వరం ఇసుక క్వారీ వద్ద నుండి లారీలో ఇసుక లోడ్ చేసుకున్నాడు. అక్కడే ఓ బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ మందు కొనుక్కున్నాడు. ఈ ఇసుకను హైదరాబాద్ తరలించే క్రమంలో వస్తూ కొనుక్కున్న మద్యం బాటిల్ లో నుండి సగం తాగేశాడు ఈ క్రమంలో హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని సాయిబాబా టెంపుల్ సమీపానికి రాగానే మద్యం మత్తులో ఉన్న సైదులు లారీ నిర్లక్ష్యంగా నడిపి తన ముందు వెళుతున్న మోటార్ సైకిల్ ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వరంగల్ నగరానికి చెందిన దేవర రత్నాకర్ (37) బండారి రత్నాకర్ (30)లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ సైదులు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో దాక్కున్నాడు.

100 డయల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడ్డ వారిని 108 ద్వారా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే రత్నాకర్ అనే వ్యక్తి మృతి చెందగా తీవ్రగాయాలతో మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ క్రమంలో సైదులు భయంతో గోవాకు పారిపోయాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ను వెతికి పట్టుకున్న పోలీసులు అతని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు తేలింది. ఈ ఘటనలో సైదులు సైతం గాయాలు అవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదమని తెలిసినా తప్పతాగి వ్యక్తి మరణానికి కారణమైనందుకుగాను సైదులుపై మానవ తప్పిదం లేని నరహత్య కేసుగా గుర్తించి, పోలీస్ కమిషనర్ సూచనల మేరకు U/S 304-11 నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్ సైదులును వెతికి పట్టుకొని ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

లారీ యజమానులకు ఎసీపీ సూచనలు

లారీ యజమానులు తమ వాహనాలకు డ్రైవర్ల నియమించుకునే క్రమంలో కుటుంబ బాధ్యతలు లేని వారిని దేశ దిమ్మరులను డ్రైవర్లు, క్లీనర్లుగా నియమించుకోవద్దన్నారు. ఒకవేళ నియమిస్తున్నట్లు అయితే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు తీసుకోవాలన్నారు. డ్రైవర్లను, క్లీనర్ ను నియమించుకునే ముందు స్థానికులైన ప్రముఖులతో హామీ పత్రం తీసుకోవాలన్నారు. సూచనలు పాటించకపోతే యాజమాన్యాలు చట్టరీత్యా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed