రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే రైతు చట్టాలు రద్దు.. ​దాసు సురేశ్

by Shyam |
dasu suresh
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించడం శుభపరిణామమని, ఇది సంపూర్ణంగా రైతుల విజయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అన్నారు. ఢిల్లీ కేంద్రంగా రైతు ఉద్యమాన్ని 14 నెలలుగా నిరాటంకంగా నడిపిన రాకేష్ తికాయత్ బృందానికి సామాన్యులు, పేద ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉపఎన్నికలలో వెలువడిన ప్రజల తీర్పు కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచనలోకి నెట్టడమే కాకుండా తాజాగా ఈ నిర్ణయానికి కారణంగా మారిందన్నారు.

ప్రజల కష్టాలను, ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాల్సిందేనన్నారు, కాదంటే ప్రజాక్షేత్రం నుంచి పార్టీలు కనుమరుగవ్వక తప్పదని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా రైతు చట్టాలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ నేతగా ఎదిగిన మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని, ఇదే తరుణంలో దేశ జనగణనలో బీసీ గణన, చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ రద్దు, ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ, బీసీ బిల్లు వంటి న్యాయబద్ధమైన అంశాలపై మోదీ సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ అంశాలు కార్యరూపం దాల్చే వరకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తాము బీసీల పక్షాన పోరాటాలను ఉదృతంగా కొనసాగిస్తూనే ఉంటామన్నారు.

Advertisement

Next Story