- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మహిళా జెడ్పీటీసీ లేఖ వైరల్

దిశ ప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా, ఆయన తనయుడు రాఘవ తీరుతో స్థానిక ప్రజాప్రతినిధులు, కింది స్థాయి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆగడాలు శృతిమించిపోతున్నా.. ఎవరూ బయటపడకుండా ఎవరికి వారే మనసులో ఉంచుకుంటున్నారు. తాజాగా.. ఓ మహిళా జెడ్పీటీసీ పేరుతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీరును ఎండగడతూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది.. లేఖలో ఉన్నది ఉన్నట్టుగా ‘దిశ’ పాఠకుల కోసం..
‘‘ మహిళా ప్రజాపతినిధుల అంటే అంత చులకనా.. సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు నియోజకవర్గంలోని ఇతర ప్రజాప్రతినిధులను చులకన చేస్తూ ప్రజలు, అధికారుల ముందు వెకిలిగా, సభ్యత లేకుండా ప్రవర్తించటం నీ అవివేకానికి, కుసంస్కారనికి నిదర్శనం. ఈ రోజు(శుక్రవారం) ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద తాత్కాలికంగా నిర్మించిన బస్ స్టాప్ షెడ్ ప్రారంభించడానికి నన్ను జెడ్పీటీసీ హోదాలో ఆర్టీసీ అధికారుల ఆహ్వానం మేరకు కార్యక్రమం ఉదయం 9.00 గంటలకు ఉంటుందని చెప్పగా నేను సమయానికంటే ముందే వచ్చి గంటల కొద్దీ వేచి చూడగా, నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మీరు 11 గంటలకు వచ్చి హడావుడిగా కొబ్బరి కాయలు కొట్టినారు. మాలాంటి ప్రజాప్రతినిధులను కనీసం ఏజెన్సీ ప్రజల రవాణా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయనియకుండా, మాట్లాడే ప్రయత్నం చేసినా నా పట్ల సహనం కోల్పోయి ఏకవచనంతో ‘నువ్వెంటి మాట్లాడేది..’ అంటూ దురుసుగా ప్రవర్తించారు.
ఇది మీ ఆత్మన్యూనతా భావానికి నిదర్శనం. ప్రజలు ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వినటానికి సహనం లేని వాళ్లు ప్రజలకు ఏమి మేలు చేస్తారో..? మీ అసహనంతో తేటతెల్లం అయింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నోరు నొక్కి మీ అసమర్థతను ఎంతో కాలం కప్పిపుచ్చులేరు. పబ్లిక్ ప్రోగ్రాంలో ప్రొటోకాల్ పాటించకుండా అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను హేళన చేస్తూ, నీ అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెడుతూ దీర్ఘకాల అభివృద్ధికి చరమ గీతం పాడుతున్నారు. నీ అనుచర గణంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పబ్బం గడుపుతున్నారు. నీ చిల్లర పనులకు విసిగి పోతున్న ప్రజలు త్వరలోనే మీకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీ మేరెడ్డి వసంత లేఖలో పేర్కొన్నారు.