ఫేస్ బుక్‌లో పరిచయం.. డబ్బులు ఇస్తానని నమ్మించి కిడ్నాప్

by  |
ఫేస్ బుక్‌లో పరిచయం.. డబ్బులు ఇస్తానని నమ్మించి కిడ్నాప్
X

దిశ, కల్వకుర్తి: ఫేస్ బుక్‌లో పరిచయమైన యువకుని దగ్గర అవసరాల కోసం రూ.30 వేలు అప్పు అడిగిన యువతిని డబ్బులు ఇస్తానని నమ్మించి కిడ్నాప్ కు యత్నించాడు ఓ యువకుడు. ఊరుకోండ ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణానికి చెందిన ఒక యువతి (19) హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ ప్రయివేటు ఉద్యోగం చేస్తుంది. మూడు నెలల క్రితం యువతికి శ్రీకాంత్ డాన్ అనే పేరుతో ఫేస్ బుక్ లో ఒక యువకుడు పరిచయమై తర్వాత చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. యువతి తన అవసరాల నిమిత్తం రూ. 30వేలు సహాయం చేయమని అడిగింది. ఇదే అదునుగా బావించిన రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన శ్రీకాంత్ (22) ఆమనగల్లుకు రా డబ్బులు ఇస్తాను.. అని నమ్మించి పిలిపించాడు. నమ్మిన యువతి శనివారం సాయంత్రం అమనగల్లుకు వచ్చింది.

కారులో గణేష్, నిఖిల్ అనే స్నేహితులతో వచ్చిన శ్రీకాంత్ డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి ఏటీఎంకి వెళ్లి తీసుకుందాం రా.. అని కారులో ఎక్కించుకున్నాడు. అమనగల్లులో ఏటీఎంలు పని చేస్తలేవు.. అని చెప్తూ కల్వకుర్తికి వెళ్దాం అని చెప్పి కల్వకుర్తికి వచ్చారు. అక్కడ కూడా ఏటీఎంలు పని చేస్తలేవని మిడ్జిల్ లో తీసుకుందామని మిడ్జిల్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన యువతి తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో యువతి దగ్గర ఫోన్ లాక్కొని అసభ్యంగా ప్రవర్తించారు. శనివారం సాయంత్రం ఊరుకొండ గేట్ దగ్గర ఎస్సై విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఆ యువతి పోలీసులను చూసి గట్టిగా కేకలు వేయగా ఎస్సై తన సిబ్బందితో టీఎస్ 07 యూహెచ్ 1423 అను నెంబర్ గల కారును వెంబడించి రేవల్లి గేట్ దగ్గర పట్టుకుని, ఆ యువతిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కిడ్నాప్ కు కారణమైన ముగ్గురు యువకులను ఆదివారం రిమాండ్ కు తరలించామని ఎస్సై వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed