స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంటే.. అబద్ధం చెప్పి అమ్మేస్తారా..? : అవంతి

by srinivas |
స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంటే.. అబద్ధం చెప్పి అమ్మేస్తారా..? : అవంతి
X

దిశ, ఏపీబ్యూరో : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆదివారం మహాపాదయాత్రను నిర్వహించాయి. ఈ మహా పాదయాత్రను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డిలు ప్రారంభించారు. పాదయాత్రను కాకతీయ గేట్ వద్ద డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రారంభించారు. ఈ పాదయాత్రలో గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ నష్టాల్లో ఉందంటూ కేంద్రం ప్రకటించడం అన్యాయమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో నడుస్తోందని చెప్పుకొచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్టీల్ ప్లాంట్‌ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు మంత్రి వెల్లడించారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీలకతీతంగా స్టీల్‌ప్లాంట్‌ కోసం పోరాటం చేయాలని అవంతి పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఏడు నెలలుగా రోడ్లపైకి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టీల్ ప్లాంట్ కోసం అలుపెరగని పోరాటం చేస్తాం..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. మహాపాదయాత్రలో పాల్గొన్న ఆయన విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్‌తో కూడిన అంశమని చెప్పుకొచ్చారు. ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. మరోవైపు విభజన హామీలను పట్టించుకోకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.

-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్

Advertisement

Next Story

Most Viewed