- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాసంగి పండుగ.. ప్రాజెక్టుల కింద విరివిగా సాగు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రాజెక్టుల కింద యాసంగి సాగు పెరుగుతోంది. ప్రాజెక్టులు, చిన్న తరహా వనరులలో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువగా సాగు జరుగుతోంది. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి అన్నీ పూర్తిగా నిండాయి. ఈ ఏడాది రబీలో కనీసంగా 53 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ప్రాజెక్టుల కింద యాసంగిలో మొత్తం 37.46 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అంచనాకు తగ్గట్టుగానే ఈ నెల 18 వరకే 24.85 లక్షల ఎకరాలు సాగైంది.
జూరాల ప్రాజెక్టు పరిధిలో ఈసారి వరి నాట్లు జోరందుకున్నాయి. జూరాల పరిధిలో 29,500 ఎకరాల్లో నాట్లు పూర్తి కాగా.. నెట్టెంపాడు కింద 28 వేలు, ఆర్డీఎస్ పరిధిలో18,750, రాజీవ్ బీమా కింద 20,850, కోయిల్సాగర్ పరిధిలో 9,700 ఎకరాల్లో పంటలు వేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 89,150 ఎకరాల్లో సాగు అంచనా వేయగా.. 88,800 ఎకరాల్లో సాగు పనులు పూర్తయ్యాయి. ఇంకా వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఇక శ్రీశైలం నీటిపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు పూర్తిస్థాయిలో నీరందుతోంది.
కల్వకుర్తి పరిధిలో ఈసారి 2,78 లక్షల ఎకరాలకు అంచనా వేయగా.. ఈ నెల 18 నాటికి 2.37 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నాగార్జున సాగర్ కింద ఈ రబీలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందనుంది. ఈ సారి కనీసంగా ఎడమ కాల్వ కింది అవసరాలకు 54 టీఎంసీల అవసరాలుండగా.. పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సాగర్ కింద ఇప్పటికే 7 లక్షల ఎకరాల సాగు దాటింది. సాగర్ కింద 6.30 లక్షల ఎకరాలను ప్రతిపాదించగా.. 4.35 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఏఎమ్మాఆర్‌పీ, ఎస్ఎల్‌బీసీ పరిధిలోని హెచ్‌ఎల్‌సీ కింద 2.22 లక్షల ఎకరాలకు 2.16 లక్షల ఎకరాలు, మూసీ కింద 28 వేల ఎకరాల అంచనాకు 24 వేల ఎకరాలు సాగు చేశారు. ఎస్సారెస్పీస్టేజ్-2 కింద ఈసారి 3.64 లక్షల ఎకరాలను ప్రతిపాదించగా.. 2.34 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. మిడ్ మానేరు పరిధిలో ఇప్పటికే 30 వేల ఎకరాలు సాగు పూర్తి అయింది.
మధ్యతరహా ప్రాజెక్టుల కింద సాగు
రాష్ట్రంలోని మధ్య తరహా ప్రాజెక్టు కింద వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 75 శాతం వరకు వరినార్లు పూర్తి అయ్యాయి. ఈసారి గోదావరికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో దేవాదుల పరిధిలోని చెరువులన్నీ నింపారు. దేవాదుల కింద ఈసారి 2.07 లక్షల ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేయగా 1.76 లక్షల ఎకరాల సాగు కంప్లీట్ అయింది. ఇక ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్‌మానేరు తదితరాల కింద భారీ ఆయకట్టు సాగులోకి వచ్చింది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమరంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల తదితర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో.. దాదాపు 2 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి.
చెరువుల కింద ఎక్కువగానే
ఈ ఏడాది చెరువుల కింద గరిష్ఠ సాగు జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 22 వేల చెరువులకుపైగా పూర్తి స్థాయిలో నిండాయి. మత్తళ్లు దుంకాయి. దీంతో ఇప్పటి వరకు కూడా చెరువులు జలకళతో ఉన్నాయి. మరోవైపు ప్రాజెక్టుల పరిధిలో కూడా కాల్వల నుంచి చెరువులను నింపారు. దీంతో చెరువుల కింద మొత్తంగా 24 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ఈసారి 20 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది.
వరిసాగు పెరిగింది
యాసంగిలో వరి సాగు ఏటా పెరుగుతోంది. గతేడాది జూన్ నుంచి ప్రాజెక్టులకు వరదలు రాగా.. అక్టోబర్ వరకూ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులన్నీ నిండాయి. గోదావరి, కృష్ణా నుంచి సముద్రంలోకి వేల టీఎంసీలు వెళ్లాయి. మరోవైపు భూగర్భ జలాలు పెరగడంతో.. బోర్ల కింద సాగు పెరిగింది. ఇందులో ఎక్కువగా వరి పంటే సాగైంది. 2019 యాసంగిలో మొత్తంగా 18.57 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే.. 2020 యాసంగిలో ఇది 32 లక్షలకు పెరిగింది. ఇప్పుడు 37.46 లక్షలు సాగు చేస్తారని అంచనా వేయగా.. 24 లక్షల ఎకరాలకుపైగా నాట్లు వేశారు.
దొడ్డు రకాలకే మొగ్గు
ఇక యాసంగిలో దొడ్డు రకం ధాన్యానికే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల కింద సాగవుతున్న దానిలో 70 శాతానికిపైగా దొడ్డు రకాలు వేసినట్లు చెబుతున్నారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా వానాకాలం సన్నాలను ఎక్కువగా సాగు చేసినా… కొనుగోళ్లలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫలితంగా రైతులు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డారు. అయితే పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ ఉండటం, కొనుగోళ్ల కష్టాలు వస్తుండటంతో ఈసారి దొడ్డు రకాలకే మొగ్గు చూపుతున్నారు.
ఇతర ప్రాంతాలలో
యాసంగి సాగుపై బుధవారం వ్యవసాయ శాఖ నివేదికలు విడుదల చేసింది. బుధవారం నాటికి రాష్ట్రంలో 32,06,290 ఎకరాలలో పంటలు వేసినట్లు వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి 25.82 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా… ఈసారి 32 లక్షలు దాటింది. ఇక ఈసారి సాధారణ సాగు 36.93 లక్షల ఎకరాలు కాగా… ఇప్పటికే 32 లక్షలు దాటింది. వరి సాధారణ సాగును దాటిపోయింది. సాధారణ సాగు 22.19 లక్షల ఎకరాలు ఉండగా ఈసారి 22.84 లక్షల ఎకరాలకు చేరింది. ఇంకా వరినార్లు వేస్తున్నారు. మరింత పెరిగే అవకాశం ఉంది. మొక్కజొన్న సాగు కూడా 2.23 లక్షల ఎకరాలకు చేరింది. మొత్తం ధాన్యం పంటలు 2.69 లక్షల ఎకరాల్లో వేశారు. కందిపంట ఈసారి తగ్గింది. శనగ పంట 2.99 లక్షల ఎకరాల్లో వేశారు. మొత్తం పప్పు ధాన్యాలు 3.56 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా… ఆహార ధాన్యాల పంటలు 29.16 లక్షల ఎకరాలకు చేరింది. అదేవిదంగా పొద్దుతిరుగుడు 2.15 లక్షల ఎకరాల్లో వేయగా… ఆయిల్సీడ్స్ మొత్తం 2.45 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు.