యాదాద్రి జిల్లా స‌రిహ‌ద్దుల మూసివేత‌

by vinod kumar |
యాదాద్రి జిల్లా స‌రిహ‌ద్దుల మూసివేత‌
X

దిశ, న‌ల్ల‌గొండ‌: యాదాద్రి జిల్లా ప్ర‌జ‌లకు ఇప్ప‌డు స్వీయ నిర్బంధమే శ్రీ‌రామ ర‌క్ష కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో క‌రోనా వైరస్ (కొవిడ్ -19) పాజిటివ్ కేసులు న‌మోదు కాలేద‌ని జిల్లావాసులు హమ్మయ్యా..అంటూ ఊపిరిపీల్చుకున్నారు. కాని యాదాద్రిభువ‌న‌గిరి చుట్టూ ఉన్న పొరుగు జిల్లాలను క‌రోనా చుట్టుముట్టేసేంది. దీంతో జిల్లా స‌రిహ‌ద్దులు దాటితే ఏ దిక్కు నుంచైనా కరోనా వచ్చే అవకాశముందని ఇప్ప‌డు యాదాద్రి జిల్లా సరిహద్దులను అధికారులు మూసేశారు.

ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో క‌రోనా విజృంభిస్తోన్న క్ర‌మంలో మార్చి 1 తర్వాత జిల్లాకు చెందిన 99 మంది ఆస్ర్టేలియా, ఆమెరికా, దుబాయ్‌, లండ‌న్‌, దక్షిణ ఆఫ్రికా, ర‌ష్యా త‌దిత‌ర దేశాల నుంచి తిరిగి సొంతింటికి చేరుకున్నారు. వీరే కాకుండా రైలు మార్గం ద్వారా నేపాల్‌కు చెందిన ఏడుగురు జిల్లాకు వ‌చ్చారు. అదే విధంగా మ‌ధ్యప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఒరిస్సా, జార్ఘండ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు త‌దిత‌ర రాష్ర్టాల నుంచి బ‌తుకుదెరువు కోసం జిల్లాకు 618 మంది వ‌చ్చిన‌ట్టు అధికారులు గుర్తించారు. వీరితో పాటు ఢిల్లీ నిజామొద్దీన్‌లో జ‌రిగిన మ‌ర్క‌జ్ ప్రార్థన‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారు 12 మంది ఉన్నారు. వీరంద‌రికి ప్ర‌భుత్వ ఆస్పత్రిలోని ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో క‌రోనా లక్షణాలకు సంబంధించి స్ర్కీనింగ్ చేశారు.

మ‌ర్క‌జ్ వెళ్లి వ‌చ్చిన వారు తెలంగాణ‌లోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌ను అప్ర‌మ‌త్తం చేసింది. దీంతో ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన వారి విష‌యంలో జిల్లా అధికారులూ కొంత క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించారు. వారంద‌రిని హోం క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత ఉన్న‌తాధికారుల అదేశాల మేర‌కు ఐసోలేష‌న్ కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఈ 12 మందిలో ఐదుగురికి క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ట్టు అనుమానించిన జిల్లా వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వారిని త‌ర‌లించారు. మిగ‌తా వారిని భువ‌న‌గిరి ప్ర‌భుత్వ హోమియో ఆస్పత్రిలోని ఐసోలేష‌న్ కేంద్రంలో క్వారంటైన్ చేశారు.

క‌రోనా నిల్‌!!

ఢిల్లీ మ‌ర్క‌జ్ వెళ్లి వ‌చ్చిన 12 మంది కుటుంబీకులు 60మందిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు. ఈ 12 మంది ర‌క్త శాంపిల్స్ సేక‌రించి ప‌రీక్ష‌ల ఫ‌లితాల కోసం హైద‌రాబాద్‌కు పంపించారు. ఒత్తిడి కారణంగా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు మూడు విడుత‌లుగా వ‌చ్చిన‌ట్టు తెలిసింది. మొద‌ట‌గా అనుమానితులుగా భావించిన ఐదుగురికి నెగిటివ్ రిపోర్టు వ‌చ్చింది. కాని వారు జ‌లుబు, జ్వ‌రంతో బాధపడటం వ‌ల్ల హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేష‌న్ వార్డులోనే ఉంచారు. ఆ తర్వాత న‌లుగురికి సంబంధించిన రిపోర్టులు సైతం నెగ‌టివ్‌గా వ‌చ్చాయి. మూడో విడ‌తలో భువ‌న‌గిరికి చెందిన ఇద్ద‌రివి, ఆలేరుకు చెందిన ఇక వ్య‌క్తికి సంబ‌ధించిన రిపోర్టులు సైతం శ‌నివారం నెగిటివ్ రావ‌డంతో జిల్లా యంత్రాగం ఊపిరి పీల్చుకుంది. అయిన‌ప్ప‌టికీ అధికారులు వీరంద‌రిని బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌లో క్వారంటైన్ చేశారు. వీరితో పాటు ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చిన న‌ల్ల‌గొండ‌, సూర్య‌పేట జిల్లాలో తొలుత తొమ్మిది పాజిటివ్ కేసులు రాగా వారి నుంచి ప్రైమ‌రీ కాంటాక్ట్ అనుమానితులు 14 మందికి క‌రోనా సోక‌డంతో జిల్లాలో అధికారులు చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

చ‌క్ర‌బంధంలో యాదాద్రి!

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాన‌ప్ప‌టికీ, న‌లుదిక్క‌ల ఉన్న పొరుగు జిల్లాలో క‌రోనా విజృంభిస్తోన్న‌ది. సేఫ్‌గా ఉన్న‌ యాదాద్రి జిల్లా క‌రోనా చ‌క్ర‌బంధంలో దాక్కున్న‌ది. యాదాద్రి జిల్లాకు తూర్పున ఉన్న జ‌న‌గామలో -2, సూర్యాపేట జిల్లాలో -8, ప‌డ‌మ‌ర ఉన్న మేడ్చ‌ల్‌లో -17, రంగారెడ్డిలో -18, ఉత్త‌రం ఉన్న సిద్దిపేట‌లో -1, దక్షిణం వైపు ఉన్న న‌ల్ల‌గొండ‌లో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో న‌లుదిక్క‌ల నుంచి క‌రోనా వైర‌స్ తొంగి చూసే ప్రమాదముందనీ, ఈ వైర‌స్‌ సంక్ర‌మ‌ణ జ‌రుగ‌కుండా ఉండేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ అనితారామ‌చంద్ర‌న్‌, డీసీపీ కె. నార‌య‌ణ‌రెడ్డిలు ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు అధికారులు జిల్లా స‌రిహ‌ద్దుల‌ను మూసివేశారు.

వర్ధమానుకోట గ్రామానికి ఫెన్సింగ్..

జిల్లా ప‌రిధిలో ఉన్న అడ్డ‌గూడూరు మండ‌లం ధ‌ర్మారం, ల‌క్ష్మిదేవికాల్వ‌, కోట‌మ‌ర్తి గ్రామాల‌కు సూర్య‌పేట జిల్లా నాగ‌రం మండ‌లం వ‌ర్ధ‌మానుకోట గ్రామానికి బిక్కేరు వాగు ఒక్క‌టే గ్రామ స‌రిహ‌ద్దు. అయితే, వర్ధమానుకోట‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి రోకనా పాజిటివ్ రావ‌డంతో ఆ గ్రామానికి ఈ జిల్లా వాసులు వెళ్ల‌కుండా ర‌హ‌దారుల‌కు అడ్డంగా ఫెన్సింగ్ క‌ట్టారు. వ్య‌వ‌సాయ బావుల బాట‌లు, పిల్ల బాట‌ల‌ను రెవెన్యూ అధికారులు ముండ్ల కంపల‌తో మూసి వేశారు. ఆ ప్రాంతాల‌ను ఏసీపీ కిష్ట‌య్య త‌న అధీనంలోకి తీసుకుని నిత్యం పెట్రోలింగ్ చేపడుతున్నారు. జ‌న‌గామా జిల్లా శివారులో ఉన్న ఆలేరు మండ‌లం గుండ్ల‌గూడెం వ‌ద్ద జిల్లా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అక్క‌డి నుంచి వాహ‌నాల‌ను జిల్లాలోకి అనుమ‌తించ‌డం లేదు. సిద్దిపేట జిల్లాకు స‌రిహ‌ద్దులో ఉన్న ఆలేరు మండ‌లం కొల‌నుపాక, తుర్క‌ప‌ల్లి మండ‌లం ధ‌ర్మారం, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లా స‌రిహ‌ద్దుగా ఉన్న సంస్థాన్‌నార‌య‌ణ పురం మండ‌లం రాచ‌కొండ‌, పోచంప‌ల్లి మండ‌లం కొత్త‌గూడెం, మేడ్చ‌ల్ జిల్లా స‌రిహ‌ద్దులో ఉన్న బొమ్మ‌ల‌రామారం మండ‌లం రంగాపురం, బీబీన‌గ‌ర్ మండ‌లం కొండ‌మ‌డుగు, న‌ల్ల‌గొండ జిల్లా స‌రిహ‌ద్దులో ఉన్న రామ‌న్న‌పేట శివారులో పోలీసులు చెక్‌పోస్టుల‌ను ఏర్పాటు చేసి 24గంట‌ల పాటు గ‌స్తీ కాస్తున్నారు. అత్య‌వ‌స‌ర వాహ‌నాల‌ను తప్ప ఇత‌ర వాహ‌నాల‌ను అనుమ‌తించ‌డం లేదు. ఇలా అధికారులు చ‌క్ర‌బంధంలో ఉన్న యాదాద్రికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ జ‌రుగ‌కుండ గట్టి చర్యలు చేపడుతున్నారు.

Tags: borders closed, prevention, covid -19, yadadri district

Advertisement

Next Story

Most Viewed