షియోమీ ఫోన్లలో భారత నావిగేషన్

by Shyam |   ( Updated:2020-02-27 02:21:22.0  )
షియోమీ ఫోన్లలో భారత నావిగేషన్
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఇప్పటివరకు వినియోగదారులు ఉపయోగిస్తున్న జీపీఎస్ నావిగేషన్ అమెరికన్లు తయారుచేసిందని తెలిసిన విషయమే. అయితే భారత అంతరిక్ష సంస్థ కూడా అందుకు పోటీగా తయారు చేసిన నావిక్ ఇంకా పెద్దగా వినియోగంలోకి రాలేదు. అయితే ఈ సమస్యను గట్టెక్కించడానికి షియోమీ వారు ముందుకొచ్చారు. 2020లో షియోమీ విడుదల చేయనున్న ఫోన్లు ఇస్రో వారి నావిక్ టెక్నాలజీని సపోర్ట్ చేయబోతున్నాయి. ఈ మేరకు ఇస్రో, షియోమీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం గురించి షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ మను జైన్ కుమార్ ట్వీట్ చేశారు. ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.

స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ల మోడల్‌లో వినియోగించబోతున్న ఈ నావిక్ టెక్నాలజీ పూర్తి పేరు నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్. భారతదేశంతో పాటు ప్రధాన భూభాగానికి 1500 కి.మీ.లో పొజిషనింగ్ గురించి నావిక్ కచ్చితంగా చెప్పగలదు. మూడు జియోస్టేషనరీ, నాలుగు జియోసింక్రొనస్ శాటిలైట్ల ద్వారా ఈ నావిక్ పనిచేస్తుంది. జీపీఎస్ 20 నుంచి 30 మీటర్లకు కచ్చితత్వాన్ని చూపిస్తుంది. కానీ నావిక్ మాత్రం 5 మీటర్ల వరకు కచ్చితంగా పొజిషన్ చూపిస్తుంది. దీని సాయంతో మనుషులు వెళ్లలేని ప్రదేశాలను ఆకాశం నుంచి చూడొచ్చు. ఇది పూర్తిస్థాయిలో స్మార్ట్‌ఫోన్లలో వినియోగానికి వస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని ఇస్రో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed