దుమారం రేపుతున్న డబ్ల్యూవీ రామన్ లేఖ

by Shyam |
WV Raman
X

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు రాసిన లేఖ ఇప్పుడు దుమారం రేపుతున్నది. మహిళా జట్టుకు రమేష్ పవార్ కోచ్‌గా నియమించబడిన తర్వాత రామన్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే జట్టులోపరిస్థితులపై ఆయన రాసిన లేఖ చర్చనీయాంశం అయ్యింది. ‘జట్టులో అంతా నేనే.. నా తర్వాతే ఎవరైనా అనే ఆలోచనలు బలంగా పేరుకొని పోయాయి.

తామే స్టార్ క్రికెటర్లము అనే భావజాలం పెరిగిపోయింది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నది. క్రికెటర్ల మనసుల్లో ఈ భావజాలం కొనసాగితే జట్టుకు మరింత చేటు చేస్తుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాటు రాహుల్ ద్రవిడ్‌కు లేఖ పంపడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహిళా క్రికెట్‌కు మున్ముందు ద్రవిడ్ సేవలు అవసరమని భావించే లేఖ పంపి ఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు రామన్ తన కోచింగ్ సమయంలో ఏనాడూ వ్యక్తిగత ప్రాముఖ్యతలకు చోటివ్వలేదని సన్నిహితులు చెబుతున్నారు. క్రికెటర్లతో విభేదాలు వచ్చిన ప్రతీసారి కోచ్‌ను మార్చడంపై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి.

Advertisement

Next Story