'జట్లను తీసుకొస్తాం.. ప్రేక్షకుల్లేకుండా ఆడటమే కష్టం'

by Shyam |
జట్లను తీసుకొస్తాం.. ప్రేక్షకుల్లేకుండా ఆడటమే కష్టం
X

కాన్‌బెర్రా : కరోనా ప్రభావంతో ఆస్ట్రేలియాలో ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఆస్ట్రేలియాలో కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడ లాక్‌డౌన్ ఎత్తేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రీడామంత్రి రిచర్డ్ కోల్‌బెక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచ కప్ కోసం ఇతర జట్లను ఆస్ట్రేలియాకు రప్పించడం పెద్ద కష్టమేమీ కాదని, కానీ స్టేడియంలో ప్రేక్షకుల్లేకుండా అంత పెద్ద మెగా టోర్నీని నిర్వహిస్తే ఏమైనా విలువుంటుందా అని’ కోల్‌బెక్ అంటున్నారు. ‘ప్రపంచ కప్‌ను తప్పకుండా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ టోర్నీలో పాల్గొనే జట్లకు తప్పకుండా భరోసా కల్పిస్తాం. కానీ ప్రేక్షకుల హాజరు విషయంలోనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నాం’ అని ఆయన అన్నారు. క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా టీ20 వరల్డ్ కప్ నిర్వహణ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాయని ఆయన చెప్పారు.

మరోవైపు ఆస్ట్రేలియా-ఇండియా మధ్య టెస్టు సిరీస్ కూడా జరగాలని ఆశిస్తున్నట్లు మంత్రి కోల్‌బెక్ చెప్పారు. కాగా, ఆస్ట్రేలియా క్రీడా మంత్రి వ్యాఖ్యలను క్రికెటర్ మార్నస్ లబుసేన్ సమర్థించాడు. ఒకవేళ భారత్ కనుక ఆస్ట్రేలియా పర్యటనకు రాకపోతే చాలా నిరాశ చెందుతామని అభిప్రాయపడ్డాడు.

Tags: Cricket, T20 World Cup, Australia, India, Richard Colbeck, Coronavirus, Covid-19

Advertisement

Next Story

Most Viewed