Bangladesh: షేక్ హసీనాకు మరో భారీ షాక్.. దౌత్య పాస్‌పోర్టు రద్దు

by Harish |
Bangladesh: షేక్ హసీనాకు మరో భారీ షాక్.. దౌత్య పాస్‌పోర్టు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్‌పోర్టును అక్కడి తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. హసీనా హయాంలో పార్లమెంటు సభ్యులకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తూ తాజాగా బంగ్లా హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటనతో హసీనా దౌత్య పాస్‌పోర్ట్‌ కూడా రద్దు అయింది. ఈ దౌత్య పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్న వారు ఎంపిక చేసిన దేశాలకు వీసా లేకుండా ప్రయాణించడానికి వీలవుతుంది. ఈ పాస్‌పోర్ట్ వల్లే హసీనా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందగలుగుతున్నారు.

దౌత్య పాస్‌పోర్టు రద్దు అనేది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు దౌత్య, రాజకీయంగా హసీనాను అడ్డుకోడానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విస్తృత వ్యూహంలో భాగం అని నిపుణులు భావిస్తున్నారు. ఆమె ఆగస్టు 5 నుంచి భారతదేశంలో ఉంటున్నారు. యూకే లేదా అమెరికా వెళ్లాలని అనుకున్నప్పటికీ ఆ దేశాలు హసీనాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. మరోవైపు బంగ్లాదేశ్ నేతలు ఆమెను తిరిగి అప్పగించాలని భారత్‌ను కోరుతున్నారు. అయితే అధికారికంగా ఆ దేశం కేంద్రాన్ని కోరలేదు. ఇటీవల ఢాకాలో చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ హసీనాను అప్పగించాలని అన్నారు, ఆమె తన స్వదేశంలో విచారణను ఎదుర్కోవాలని డిమాండు చేశారు.

Advertisement

Next Story