Shehbaz Sharif: చైనా ప్రాజెక్టులను ఆపడానికే ఉగ్రదాడులు.. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్

by vinod kumar |
Shehbaz Sharif: చైనా ప్రాజెక్టులను ఆపడానికే ఉగ్రదాడులు.. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పలుచోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 73 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగమైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆపడమే లక్ష్యంగా బలూచిస్థాన్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మంగళవారం ఆయన మంత్రివర్గంతో నిర్వహించిన భేటీలో మాట్లాడారు. టెర్రరిస్టులు సీపీఈసీ, అభివృద్ధి ప్రాజెక్టులను ఆపాలనుకుంటున్నారని తెలిపారు. పాక్ చైనా మధ్య చీలికలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముష్కరులు ఇప్పటికైనా దాడులను ఆపాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దాడులను ఖండించిన చైనా

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్ర దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. పాక్ ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు నిరంతరం తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు డ్రాగన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చైనా కఠిన వైఖరిని అవలంభిస్తుందని తెలిపారు. సామాజిక స్థిరత్వాన్ని కొనసాగించడం, ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడానికి చైనా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో ఉగ్రవాద నిరోధక, భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడానికి చైనా సిద్ధంగా ఉందని తెలిపారు.

కాగా, ఖనిజాలు అధికంగా ఉన్న బలూచిస్థాన్‌లో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి పాక్ చైనా సహాయం తీసుకుంది. సీపీఈసీ ఒప్పందం ద్వారా ఈ ప్రాంతంలో పలు ప్రాజెక్టులను చేపడుతోంది. అయితే అత్యధిక ఖనిజాలను వినియోగించుకుంటున్న పాక్ బలూచిస్థాన్ ప్రావీన్సును మాత్రం డెవలప్ చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు బలూచిస్థాన్ ప్రావీన్సులోని స్థానికులను విడిచి పెట్టి బయటి వారిని మాత్రమే మట్టుబెట్టినట్టు సమాచారం.

Advertisement

Next Story