Russia: విరాళం ఇచ్చినందుకు యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష వేయాలని డిమాండ్

by Harish |
Russia: విరాళం ఇచ్చినందుకు యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష వేయాలని డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ అనుకూల స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇచ్చినందుకు అమెరికా-రష్యా ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఒక యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష వేయాలని తాజాగా రష్యన్ ప్రాసిక్యూటర్లు అక్కడి కోర్టులో డిమాండ్ చేశారు. ఆ యువతి పేరు బాలేరినా క్సేనియా కరేలినా. రష్యా సంతతికి చెందిన ఆమె చాలా సంవత్సరాలుగా లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తుంది. 2021లో అమెరికన్ పౌరసత్వాన్ని కూడా పొందింది. అయితే ఆమె కుటుంబసభ్యులు రష్యాలో నివసిస్తుండటంతో వారిని చూడటానికి ఈ ఏడాది జనవరిలో మాస్కోకు వచ్చింది.

అప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమె ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే స్వచ్ఛంద సంస్థ అయిన రజోమ్‌కు సుమారు $50 విరాళం ఇచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు మాస్కోకు తూర్పున 1,600 కి.మీ దూరంలో ఉన్న యెకాటెరిన్‌బర్గ్‌లో ఆమెను అదుపులోకి తీసుకుని రష్యా వ్యతిరేక దేశానికి విరాళం ఇచ్చినందుకు ఆమెపై దేశద్రోహం అభియోగాన్ని మోపి అరెస్ట్ చేశారు.

తాజాగా విచారణలో భాగంగా ఆమె తన నేరాన్ని అంగీకరించగా రష్యన్ ప్రాసిక్యూటర్లు ఆమెకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోర్టును కోరారు. ఆమె న్యాయవాది మిఖాయిల్ ముషైలోవ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీనిపై వచ్చే గురువారం తీర్పు ఇస్తామని కోర్టు పేర్కొంది. 2022లో రష్యా తన పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించిన తర్వాత తమ దేశం నుంచి ఎవరైనా ఉక్రెయిన్‌కు అనుకూలంగా మాట్లాడిన, లేదా దానికి మద్దతుగా ఎలాంటి సహాయం చేసిన "దేశద్రోహం"కింద కఠిన శిక్షలు విధిస్తుంది.

Advertisement

Next Story