పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

by Naveena |
పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలను పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం గద్వాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు వివరాలను అధికారుల నుండి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులను పరిశీలించడంతో పాటు, పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిభిరం, మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు ఏదైనా అస్వస్థతకు గురైతే, వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్‌, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాల‌ని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లను అనుమతించరాదని అన్నారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కి అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాల‌ని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి తొలి రోజు పరీక్షలకు మొత్తం 7,597 మంది విద్యార్థులు నమోదు కాగా, వీరిలో 7,565 మంది హాజరై, 99.58 హాజరు శాతం నమోదయ్యిందని, 32 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అంధ విద్యార్థుల పరీక్షా తీరును పరిశీలించి, వారికి అందించిన సహాయ రచయిత (స్క్రైబ్), మౌలిక వసతులను సమీక్షిస్తూ, అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed