- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉప్పల్ వాసుల ఓర్పుకి నా నమస్సుమాంజలి! ఫ్లైఓవర్ ఎప్పుడైతదో? నెటిజన్ల ఆసక్తికర చర్చ

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గత కొన్నేళ్లుగా ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లై ఓవర్ బ్రిడ్జి) పనులు నత్త నడకగా సాగుతుండటంతో ఉప్పల్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. నిత్యం వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు, మరోవైపు ప్రమాదాలకు గురవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ ఫ్లై ఓవర్ (Uppal Flyover) మరోసారి చర్చానీయాంశంగా మారింది. ఉప్పల్ ఫ్లై ఓవర్ ఎప్పుడు పూర్తవుతుందోనని ఎక్స్ వేదికగా యూజర్లు ఆసక్తికర చర్చ పెట్టారు. ‘ఉప్పల్ వాసుల ఓర్పుకి నా నమస్సుమాంజలి’ అంటూ ఓ ఎక్స్ యూజర్ ఫోటోను షేర్ చేశారు.
ప్రజాప్రతినిధుల తీరుపై ఆ పోస్టులో నెటిజన్‌లు అసహనం వ్యక్తం చేశారు. ‘అదొక నరకం, ఆమధ్య మినిస్టర్ రెండేళ్లలో ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అన్నారు. సహజంగా నాయకుల్ని నమ్మని నేను మానసిక దుర్బల స్థితిలో నమ్మేశాను’ అని ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ పెట్టారు. ‘నిజం వారందరి ఓపిక కు నా దండాలు. నేను ఈ రోజు అదే రూట్‌లో వెళ్లాలని తలుచుకుంటేనే భయంగా ఉంది ఆ పొల్యూషన్ వల్ల’ అంటూ మరో నెటిజన్ తెలిపారు. ‘2018 నుంచి ఇంకా అలానే ఉంది. బోడుప్పల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ప్రతిసారీ కంట్లో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. ఎన్ని యాక్సిడెంట్లు జరిగినా ఎంత బాధ పడిన అయ్యో పాపం అంటారు కాని సమస్య కి న్యాయం త్వరగా జరగదు. అలవాటు పడిపోయిన ప్రాణాలు.’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇప్పటికే ఎనిమిదేళ్లు అయిందని, మరో పదేళ్లలో పూర్తి చేస్తారేమోనని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఈ ఫ్లై ఓవర్‌ను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాలను నెటిజన్లు కోరుతున్నారు. బెంగళూరులో సైతం ఇలాంటి ఫ్లై ఓవర్ తిప్పలు ఉన్నాయని కొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ చేశారు.
కాగా, ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018 లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్లగా అంచనా వేసినప్పటికీ, 2020 జూలైలో పూర్తి చేయాల్సిన పనులు వివిధ కారణాల వల్ల ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.