ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా.. ఖండించిన ఇరాన్

by Harish |
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా.. ఖండించిన ఇరాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌ దేశానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను(IRGC) కెనడా తీవ్రవాద సంస్థ జాబితాలో బుధవారం చేర్చింది. దీనిపై తాజాగా స్పందించిన ఇరాన్.. కెనడా చర్యను ఖండించింది. కెనడా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ద్వారా గార్డ్స్‌ సైనిక శక్తి ఎలాంటి ప్రభావానికి లోనుకాదు. ఇది అవివేకమైన, సాంప్రదాయేతర రాజకీయ-ప్రేరేపిత చర్య అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ గురువారం అక్కడి స్థానిక వార్తా ఏజెన్సీతో అన్నారు. కెనడా ప్రతిపక్ష శాసనసభ్యులు, కొంతమంది సభ్యుల ఒత్తిడితో కెనడా ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.

రెవల్యూషనరీ గార్డ్స్‌ను తీవ్రవాద సంస్థగా జాబితా చేయడంతో ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న మాజీ సీనియర్ ఇరాన్ అధికారుల విచారణకు దారితీయవచ్చు. గార్డ్స్‌‌‌లోని ఉన్నతాధికారులతో సహా, వేలాది మంది సీనియర్ ఇరాన్ ప్రభుత్వ అధికారులు కెనడాలోకి రావడానికి నిషేధం ఉంటుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ ఇరాన్‌లో ప్రధాన సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తి. దీనికి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మిత్రరాజ్యాల ప్రభుత్వాలు, సాయుధ సమూహాలకు డబ్బు, ఆయుధాలు, సాంకేతికత, శిక్షణ, సలహాలను అందిస్తుంది.

ఇంతకుముందు అమెరికా మొదటగా 2019లో ఐఆర్‌జీసీని తీవ్రవాద సంస్థగా గుర్తించగా, ఇప్పుడు రెండో దేశంగా కెనడా నిలిచింది. ఇదిలా ఉంటే, 2020 జనవరిలో విమానం PS752 పై రివల్యూషనరీ గార్డ్స్‌ క్షిపణి దాడి చేయగా దానిలో ఉన్న మొత్తం 175 మంది ప్రయాణికులు మరణించారు, వీరిలో 55 మంది కెనడియన్ పౌరులు, 30 మంది కెనడా శాశ్వత నివాసితులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత స్పందించిన ఇరాన్ పొరపాటున విమానంపై క్షిపణి దాడి జరిగిందని పేర్కొంది.

Advertisement

Next Story