తైవాన్‌పై చైనా యుద్ధం ప్రకటిస్తే ఎంత నష్టమో తెలుసా!

by S Gopi |
తైవాన్‌పై చైనా యుద్ధం ప్రకటిస్తే ఎంత నష్టమో తెలుసా!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికే కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధాలను చూసిన ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరో యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్నాళ్ల నుంచి తైవాన్ భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్ దేశం తమ భూభాగమేనని డ్రాగన్ దేశం వాదిస్తూ వస్తోంది. అందులో భాగంగానే తైవాన్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు, తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన సమయంలో తైవాన్ గగనతలంపైకి యుద్ధ విమానాలను, నౌకలను పంపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు తైవాన్‌కు అగ్రరాజ్యం అమెరికా అండగా ఉండటంతో చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌ను దక్కించుకునేందుకు చైనా దాడులు తీవ్రం చేసి యుద్ధానికి దిగితే భారీగా ఆర్థిక నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తైవాన్‌పై చైనా యుద్ధానికి దిగితే దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. దీన్ని భారత కరెన్సీలోకి మారిస్తే సుమారు రూ. 830 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. ఇది ప్రపంచ జీడీపీలో 10 శాతానికి సమానం కావడం గమనార్హం.

ఒకవేళ పరిస్థితులు తీవ్రమై చైనా తైవాన్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తే కొవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు మించిన అతిపెద్ద సంక్షోభాన్ని ప్రపంచం చూడనుంది. ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌ను తమ దేశంలో విలీనం చేసే తీరుతామని చెప్పడం ఇందుకు బలాన్నిస్తోంది. ఈ నెల 13న తైవాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంసమయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో చైనాకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆర్థిక ఆంక్షల ద్వారా మిత్రదేశాలను చేర్చుకోవడంలో అమెరికా విజయం సాధించవచ్చని అంచనా. బ్లూమ్‌బర్గ్ ప్రకారం, ఒకవేళ తైవాన్‌ ప్రధాన భూభాగాన్ని చైనా ఏడాది పొడవునా దిగ్బంధనం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఉండనున్నాయి. ముందుగా అంతర్జాతీయంగా చిప్‌ల తయారీకి కీలకమైన కేంద్రంగా ఉన్న తైవాన్ నుంచి ఎగుమతులు క్షీణించనున్నాయి. దీని తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలు, చైనా మధ్య పన్నుల కొట్లాట, ఆసియా ప్రాంతానికి రవాణా ఇబ్బందులతో మొత్తంగా ఆర్థిక మార్కెట్ పతనం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed