Fire mushroom: ఆకాశంలో పుట్టగొడుగు అగ్ని మేఘం! మలేషియాలో పేలిన భారీ గ్యాస్ పైప్ లైన్

by Ramesh N |
Fire mushroom: ఆకాశంలో పుట్టగొడుగు అగ్ని మేఘం! మలేషియాలో పేలిన భారీ గ్యాస్ పైప్ లైన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మలేషియా (Malaysia) రాజధాని కౌలాలంపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కౌలాలంపూర్ సమీపంలోని సెలంగోర్ పుత్రా హైట్స్‌ (Putra Heights)లో పెట్రోల్ పంప్ వద్ద భారీ గ్యాస్ పైప్‌లైన్ పేలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ డజన్ల కొద్ది ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను నిలువరించే ప్రయత్నం చేసింది. అలాగే చుట్టుపక్కల నివాస ప్రాంతంలోని ప్రజలను వెంటనే అధికారులు ఖాళీ చేయించారు. ఈ అగ్నిప్రమాదంలో 33 మంది గాయపడ్డారని, వారిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

గ్యాస్ పైప్ లైన్ కావడంతో ఎగసిపడుతున్న మంటలు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒక పెద్ద మండుతున్న అగ్ని పుట్టగొడుగు మేఘం (Fire mushroom) ఆకారంలోకి ఎగిసిపడటం కనిపించింది. ఈ ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వాన్ మొహమ్మద్ రజాలి వాన్ ఇస్మాయిల్‌య స్పందించారు. మంగళవారం ఉదయం 8:10 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుందని, పైప్‌లైన్‌లో 500 మీటర్ల పొడవునా మంటలు చెలరేగాయి అని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన కొంత సమయం తర్వాత పైప్ లైన్‌ను వేరుచేశామని పెట్రోనాస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మండుతున్న పైప్‌లైన్‌లోని వాల్వ్‌ను మూసివేసినట్లు పేర్కొన్నారు. నివాస ప్రాంతంలో మంటలు ఎంతవరకు వ్యాప్తి చెందాయో ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed