X Shut Down : బ్రెజిల్‌లో కార్యకలాపాలను ఆపేసిన ‘ఎక్స్’.. కారణం తెలిస్తే షాకవుతారు !

by Hajipasha |
X Shut Down : బ్రెజిల్‌లో కార్యకలాపాలను ఆపేసిన ‘ఎక్స్’.. కారణం తెలిస్తే షాకవుతారు !
X

దిశ, నేషనల్ బ్యూరో : ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రెజిల్ దేశంలో ఎక్స్ ప్రత్యక్ష కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. బ్రెజిల్ సుప్రీంకోర్టుకు చెందిన అలెగ్జాండ్రే డీ మోరేస్ అనే జడ్జీ నుంచి పొంచి ఉన్న ముప్పు వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘‘న్యాయమూర్తి అలెగ్జాండ్రే డీ మోరేస్ శుక్రవారం రాత్రి కొన్ని సోషల్ మీడియా సెన్సార్ షిప్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఒకవేళ వాటిని ‘ఎక్స్’ పాటించకుంటే, కంపెనీకి చెందిన లీగల్ రిప్రజెంటేటివ్‌‌ను అరెస్టు చేయాలని ఆయన రహస్య ఆదేశాలు జారీ చేశారు’’ అని పేర్కొంటూ ఎక్స్ ఒక పోస్ట్ చేసింది.

‘‘సుప్రీంకోర్టు జడ్జీ స్థానంలో ఉన్నవారు అధికారికంగా, దేశ ప్రజలందరికీ తెలిసేలా ఆదేశాలు ఇవ్వాలి. కానీ తమ కంపెనీని వేధించే ఉద్దేశంతోనే ఆయన రహస్య ఆర్డర్స్ ఇచ్చారు’’ అని ఎక్స్ ఆరోపించింది. ఈ ఒత్తిడులు, వేధింపుల వల్లే తాము బ్రెజిల్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది. ‘‘ఎక్స్‌కు వ్యతిరేకంగా గతంలోనూ పలుమార్లు బ్రెజిల్ కోర్టులు మార్గదర్శకాలను జారీ చేశాయి. వాటిపై మేం అక్కడి సుప్రీంకోర్టులో చాలాసార్లు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశాం. అయినా చట్టపరమైన వేధింపులు ఆగలేదు. వాటి వల్ల మా సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది’’ అని ఎక్స్ వివరించింది. బ్రెజిల్‌లో ప్రత్యక్ష కార్యకలాపాలను తాము ఆపేసినప్పటికీ.. బ్రెజిలీయన్ యూజర్ల ఎక్స్ ఖాతాలు యాక్టివ్‌గానే ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story