ఫిలిప్పీన్స్ నేవీపై గల్వాన్ తరహా దాడికి పాల్పడ్డ చైనా.. కత్తులు, గొడ్డళ్లతో..

by Harish |
ఫిలిప్పీన్స్ నేవీపై గల్వాన్ తరహా దాడికి పాల్పడ్డ చైనా.. కత్తులు, గొడ్డళ్లతో..
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ చైనా సముద్రంలో చైనీస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది కత్తులు, గొడ్డళ్లతో ఫిలిప్పీన్స్ నావికాదళ నౌకపై దాడి చేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా, దాడికి సంబంధించిన ఫుటేజీని తాజాగా ఫిలిప్పీన్స్ మిలటరీ విడుదల చేసింది. దీనిని భారత్- చైనా దళాల మధ్య 2020 లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన సంఘటనతో పోల్చుతున్నారు. స్ప్రాట్లీ దీవులలోని రెండవ థామస్ షోల్ సమీపంలోని సియెర్రా మాడ్రే అనే శిథిలావస్థ యుద్ధనౌకలో ఉన్న మెరైన్‌లను తరలించే సమయంలో ఫిలిప్పీన్స్ నౌక చట్ట విరుద్ధంగా జలాల్లోకి ప్రవేశించిందని పేర్కొంటూ చైనా కోస్ట్ గార్డ్ ఫిలిప్పీన్స్‌ దళాలతో వాదనకు దిగారు.


చైనా దళాలు కత్తులు, గొడ్డళ్లతో వారి నౌకలపై దాడి చేశారు. పడవలను ఎటూ కదలకుండా చుట్టూ చైనా పడవలను అడ్డుపెట్టి వారిని బెదిరించారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్‌ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటనవేలు తెగిపోయింది. ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం, ఒక చైనీస్ కోస్ట్ గార్డ్ ఫిలిప్పీన్స్‌ పడవలను కర్రతో కొట్టినట్లుగా ఉంది, మరో వ్యక్తి పడవను కత్తితో పొడిచినట్లు కనిపిస్తుంది. మరొకరు చేతిలో గొడ్డలి పట్టుకుని ఫిలిప్పీన్స్‌ సిబ్బందిని బెదిరిస్తున్నారు.

ఈ ఘటనపై ఫిలిప్పీన్స్‌ ఆర్మీ స్పందించింది. చైనా కోస్టుగార్డు సముద్రపు దొంగల్లా దాడికి తెగబడ్డారని పేర్కొంది. మా సైనికుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. అయిన కూడా ఆయుధాలను కలిగి ఉన్న చైనా కోస్ట్‌గార్డ్‌‌‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మా పడవల నుంచి తీసుకున్న వస్తువులు, పరికరాలను తిరిగి ఇవ్వాలని, నష్టానికి పరిహారం చెల్లించాలని పేర్కొంది. దీనిపై చైనా స్పందిస్తూ, కోస్ట్ గార్డ్ చట్టానికి అనుగుణంగా ఫిలిప్పీన్స్ నౌకలపై అవసరమైన నియంత్రణ చర్యలు మాత్రమే తీసుకున్నామని, వారిపై దాడులు చేయలేదని, సంయమనంతో వ్యవహరించామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఫుటేజీని సైతం చైనా విడుదల చేసింది. అయితే ఫిలిప్పీన్స్‌ విడుదల చేసిన ఫుటేజీలో చైనా సిబ్బంది చేతిలో కత్తులు, ఆయుధాలు ఉన్నట్లు కనిపిస్తుండగా, చైనా ఫుటేజీలో మాత్రం ఆయుధాలు లేకపోవడం గమనార్హం.

Advertisement

Next Story