Paris Olympics: ఒలింపిక్స్‌‌కు ముందు పారిస్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

by Harish |
Paris Olympics: ఒలింపిక్స్‌‌కు ముందు పారిస్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రఖ్యాత 2024 ఒలింపిక్ క్రీడలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం అయ్యే తరుణంలో పారిస్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం-శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, 25 ఏళ్ల బాధిత మహిళ పారిస్‌లోని పిగాల్లె పరిసరాల్లోని బార్‌లు, క్లబ్‌లలో మద్యం సేవించింది. ఆ సమయంలో ఆమెను అనుసరించిన ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి బారి నుంచి బయటపడ్డ బాధిత మహిళ ప్రసిద్ధ బౌలేవార్డ్ డి క్లిచిలోని స్థానిక రెస్టారెంట్‌లోకి చిరిగిన దుస్తులతో భయంతో ఏడుస్తూ తలదాచుకుంది.

అక్కడి సిబ్బంది ఆమె పరిస్థితి గమనించి వాకబు చేయగా, తనపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. అయితే బాధిత మహిళ హోటల్ సిబ్బంది, ఇతర కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తిని చూపిస్తూ, తనపై దాడి చేసిన గ్యాంగ్ లో సభ్యుడిగా అతడు ఉన్నాడని సైగ చేస్తుండగా, వెంటనే అతను ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. షాపు యజమానులు ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులను పిలిపించగ, వారు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

మహిళ చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఇప్పటికే ఆ మహిళ ఆస్ట్రేలియాకు టికెట్లు బుక్ చేసుకోగా, దర్యాప్తు కోసం ఇప్పడు ఆమె పారిస్‌లోనే ఉండనుంది.

ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ఒలింపిక్ టీమ్ చీఫ్ అన్నా మీరెస్‌ పారిస్ నగరంలో భద్రత ఉందని అథ్లెట్లకు తెలియజేసినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు జట్టు యూనిఫాం ధరించవద్దని సూచించారు. జులై 26న ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడలకు ముందు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో భద్రతను మరింత పెంచారు.

Advertisement

Next Story

Most Viewed