‘2023లో ప్రపంచంలోనే అత్యంత విపత్తులకు గురైన ప్రాంతం ఆసియా’

by Disha Web Desk 17 |
‘2023లో ప్రపంచంలోనే అత్యంత విపత్తులకు గురైన ప్రాంతం ఆసియా’
X

దిశ, నేషనల్ బ్యూరో: వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా 2023లో ప్రపంచంలోనే అత్యంత విపత్తులకు గురైన ప్రాంతంగా ఆసియా నిలిచిందని ఐక్యరాజ్యసమితి మంగళవారం తెలిపింది. వరదలు, తుఫానులు ప్రాణనష్టం, ఆర్థిక నష్టాల కారణంగా ఆసియా ప్రాంతం మొత్తం కూడా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందని UN పేర్కొంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు గత సంవత్సరం రికార్డు స్థాయికి చేరుకోగా, ముఖ్యంగా ఆసియా మరింత వేడెక్కుతున్నదని UNకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇక్కడ వేడిగాలులు ఎక్కువగా పెరిగాయి, దీంతో ఆసియాలో హిమానీ నదులు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ ప్రాంతంలో భవిష్యత్తు నీటి భద్రతకు ముప్పు ఉందని వాతావరణ సంస్థ హెచ్చరిస్తుంది.

ప్రపంచ సగటు కంటే ఆసియా మరింత వేడెక్కుతున్నదని, గత ఏడాది ఉష్ణోగ్రతలు 1961 నుండి 1990 సగటు కంటే దాదాపు రెండు డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. వాతావరణ మార్పు వలన సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు, మానవ నివాసాలపై తీవ్ర ప్రభావం కనబడుతుందని UN పేర్కొంది. స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా 2023 నివేదిక, ఉపరితల ఉష్ణోగ్రత, హిమానీ నదులు కరగడం, సముద్ర మట్టం పెరుగుదల వంటి కీలక వాతావరణ మార్పులను హైలైట్ చేసింది, ఇవి ఈ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థలకు తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయని పేర్కొంది.

1991-2020 సగటు కంటే 2023లో ఆసియాలో వార్షిక సగటు ఉపరితల ఉష్ణోగ్రత రెండవ అత్యధిక రికార్డు అని నివేదిక తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ సైబీరియా నుండి మధ్య ఆసియా వరకు, తూర్పు చైనా నుండి జపాన్ వరకు అధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. గత సంవత్సరం, ఆసియాలో వాతావరణ ప్రమాదాలతో సంబంధం ఉన్న 79 విపత్తులు జరగ్గా, వాటిలో 80 శాతానికి పైగా వరదలు, తుఫానులతో కూడి ఉన్నాయి. దాదాపు 2,000 కంటే ఎక్కువ మరణాలు సంభవించగా, 90 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు.

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం అనేది, అభివృద్ధి చెందుతున్న వాతావరణానికి అనుగుణంగా మారడం మాత్రమే కాకుండా ఇది ప్రాథమిక అవసరం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఆసియా ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.



Next Story

Most Viewed