ఆకాశంలో మరో అరుదైన దృశ్యం.. ఒకే వరుసలో 7 గ్రహాలు.. ఎప్పుడంటే?

by D.Reddy |
ఆకాశంలో మరో అరుదైన దృశ్యం.. ఒకే వరుసలో 7 గ్రహాలు.. ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఆకాశంలో మరో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే రాత్రివేళ ఆకాశంలో వరుసగా కనిపించే అంగారక, బృహస్పతి, యూరేనస్‌, నెప్ట్యూన్, శుక్రుడు, శని గ్రహాల సరసన బుధుడు కూడా వచ్చి చేరబోతున్నాడు. వాటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. 'ప్లానెట్ పరేడ్'గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం కానుంది. టెలిస్కోప్ అవసరం లేకుండానే ఈ 7 గ్రహాలను ఒకేసారి చూడొచ్చు. ఇక అమెరికా, మెక్సికో, కెనడా, భారత దేశ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరు.

ఈనెల 19న శుక్రుడు, శని గ్రహాలు ఒక వరుసలోకి వచ్చాయి. ఆ తర్వాత 21న శుక్రుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, అంగారకుడు వరుసలోకి వచ్చి చేరాయి. ఈ ఆరు గ్రహాలను ఒకే వరుసలో ఈనెల 31 వరకు రాత్రి వేళలో చూడొచ్చు. అంతేకాదు, ఈనెల 25న ఇవి భూమికి మరింత దగ్గరగా కనిపిస్తాయి. కానీ, కొద్ది సేపు మాత్రమే ఈ ప్లానెట్ పరేడ్ కనిపిస్తుంది. అది కూడా సూర్యాస్తమయ సమయంలో, సాయంత్రం 8:30 గంటల సమీపంలో కొద్ది సేపు మాత్రంలో ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇలాంటి అద్భుత దృశ్యం చివరిసారిగా 2022లో ఆవిష్కృతం అయింది.

Next Story