- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హైదరాబాద్‌లో సీఎస్ఐఆర్ స్టార్టప్ కాంక్లేవ్.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు

దిశ, తెలంగాణ బ్యూరో: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ కాంక్లేవ్ 2025ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. సీఎస్ఐఆర్ కు చెందిన సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్జీఆర్ఐ సంస్థలు భారతీయ పరిశోధన, సాంకేతిక రంగాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కార్యక్రమం క్యాటలైజింగ్ ఇన్నోవేషన్, కనెక్టింగ్ ఎకోసిస్టమ్స్ థీమ్ తో ముందుకు సాగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోడీ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పిలుపునకు అనుగుణంగా, ఈ కాంక్లేవ్ భారతీయ పరిశోధన, సాంకేతిక రంగంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించనుంది.
ఈనెల 22, 23 తేదీల్లో స్టార్టప్ కాంక్లేవ్..
పరిశోధన సంస్థలు, స్టార్టప్ ల మధ్య సహాకారాన్ని సులభతరం చేయడం, భారత్లో ఎంట్రప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నెల 22, 23 తేదీల్లో హైదబాద్లో సీఎస్ఐఆర్ స్టార్టప్ కాన్క్లేవ్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై సీఎస్ఐఆర్ కు చెందిన సంస్థలు ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్ జీఆర్ఐ డైరెక్టర్లతో కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ సమీక్షలు సైతం నిర్వహించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ కాంక్లేవ్‌ను సీఎస్ఐఆర్ ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్జీఆర్ ఐ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఈనెల 22, 23 న హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలో జరగనుంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. తద్వారా అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా సంబంధాలు ఏర్పడి, అవకాశాలను అన్వేషించడం సాధ్యమవుతందని భావిస్తోంది. ఈ కాంక్లేవ్‌ను 22 న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి పలు అంశాలపై ప్రసంగించనున్నారు. 23న కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా సీఎస్ ఐఆర్ -ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఈ కాంక్లేవ్ భారతీయ పరిశోధన, సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే కాకుండా, ముఖ్యంగా హైదరాబాద్‌లోని మూడు సీఎస్ఐఆర్ ల్యాబ్‌ల ద్వారా అభివృద్ధి చేసిన స్టార్టప్‌లు, సాంకేతికతలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తుందని తెలిపారు. సీఎస్ఐఆర్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం నగరంలోని మూడు సీఎస్ఐఆర్ ల్యాబ్‌లతో కలిసి పనిచేస్తున్న డీప్-టెక్ స్టార్టప్‌లను వెలుగులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ స్టార్టప్‌లు ఆరోగ్య సంరక్షణ, రసాయన భూభౌతిక రంగాలలో గణనీయమైన కృషి చేస్తున్నాయని, యువత వీరిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని వ్యవస్థాపక ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్జీఆర్ఐ పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలు పరిశ్రమ, విద్యాసంస్థల నుండి విద్యార్థులతో సహా నిజమైన భాగస్వాముల ద్వారా నడపబడుతున్నాయన్నారు.