ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 మందికి పైగా రష్యా సైనికుల మృత్యువాత: నివేదిక

by Disha Web Desk 17 |
ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 మందికి పైగా రష్యా సైనికుల మృత్యువాత: నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఒక అంతర్జాతీయ మీడియా నివేదిక పేర్కొంది. దాడులు ప్రారంభమైన రెండో ఏడాదిలో 27,300 కంటే ఎక్కువ రష్యా సైనికులు మరణించగా, ఇది మొదటి ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ అని తెలిపింది. BBC రష్యన్, మీడియాజోనా, వాలంటీర్లు ఫిబ్రవరి 2022 నుండి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సంభవించిన మరణాలను లెక్కిస్తున్నారు. తాజాగా బుధవారం వారి నివేదికను విడుదల చేశారు.

సెప్టెంబర్ 2022 లో రష్యా ఆమోదించిన అధికారిక మరణాల సంఖ్య కంటే ప్రస్తుత మరణాలు ఎనిమిది రేట్లు ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. అలాగే ఉక్రెయిన్ 31,000 మంది సైనికులను కోల్పోయినట్లు ఫిబ్రవరిలో ప్రకటించింది. అయితే పూర్తి నిర్ధారణ తర్వాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గే ఉండే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా రష్యా సైనికుల మరణాలు పెరగడానికి ప్రధాన కారణం జనవరి 2023లో డోనెట్స్క్‌లో పెద్ద ఎత్తున దాడి చేయడం.

వాలంటీర్లు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా అంతటా 70 శ్మశానవాటికల్లో కొత్త సైనిక సమాధులను లెక్కించారు. విమానాల నుంచి తీసిన ఫొటోల ప్రకారం, స్మశాన వాటికలు గణనీయంగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. 2022 ఫిబ్రవరి 24న, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున సైనిక చర్యను ప్రారంభించారు. అప్పటి నుంచి రెండు దేశాల్లో పరిస్థితులు అద్వానంగా మారాయి. ఇరుపక్షాలు కూడా వేల సంఖ్యలో సైనికులు, పౌరులను కోల్పోయాయి.

Next Story

Most Viewed