ఆఫ్రికా జిబౌటీలో పడవ బోల్తా.. 16 మంది మృతి, 28 మంది మిస్సింగ్: UN

by Disha Web Desk 17 |
ఆఫ్రికా జిబౌటీలో పడవ బోల్తా.. 16 మంది మృతి, 28 మంది మిస్సింగ్: UN
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 77 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 28 మంది తప్పిపోయినట్లు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసల సంస్థ మంగళవారం తెలిపింది. అయితే ఈ ప్రమాదం ఏ రోజు జరిగిందనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. ప్రస్తుతం మిగతా వారిని కనిపెట్టడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతకుముందు ఏప్రిల్ 8న జిబౌటికి ఈశాన్య ప్రాంతంలోని గోడోరియా తీరంలో 60 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ మునిగిపోగా, ఈ ప్రమాదంలో పిల్లలతో సహా 38 మంది వలసదారుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మరో ఆరుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) తెలిపింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు 77 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రతి సంవత్సరం, అనేక మంది ఆఫ్రికన్ వలసదారులు ఎర్ర సముద్రం మీదుగా ప్రమాదకరమైన తూర్పు మార్గంలో ప్రయాణిస్తూ సౌదీ అరేబియా చేరుకుంటారు.



Next Story

Most Viewed