'కరోనాను మించిన విలయం రాబోతుంది'

by vinod kumar |
కరోనాను మించిన విలయం రాబోతుంది
X

దిశ, వెబ్ డెస్క్ : చైనాలోని వూహాన్‌లో తొలుత గుర్తించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో భారీ ప్రాణ నష్టాన్నే కాకుండా ఆర్థిక వ్యవస్థ పతనానికి కూడా కరోనా కారణమైంది. కరోనా విజృంభణ ఇదే విధంగా కొనసాగితే రాబోయే మూడు నెలల్లో ఆకలి చావులు పెరిగిపోతాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చీఫ్ డేవిడ్ బిస్లే హెచ్చరిస్తున్నారు. కరోనాను మించిన విలయంగా ఆకలి చావులు తయారవుతాయని.. రోజుకు మూడు లక్షల మంది మరణించే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. కరోనా క్లిష్ట సమయంలలో వ్యవసాయ రంగం కూడా భారీగా నష్టాన్ని చవిచూస్తోందని.. ఇది ఆహార సంక్షోభానికి దారి తీయనుందని డేవిడ్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఆకలితో 3 కోట్ల మంది చనిపోయే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ఇప్పటికే చాలా పేద దేశాలు ఆర్థికంగా చితికిపోయాయని.. తమ ప్రజలకు కనీస అవసరాలను కూడా ఏర్పాటు చేయలేక చేతులెత్తేశాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలు ఐక్యరాజ్యసమితికి ఇచ్చే నిధుల్లో కోత విధించడం తగదని ఆయన విన్నవించారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా 10 కోట్ల మందికి ఆహారం అందస్తున్నామని.. వీరిలో 3 కోట్ల మంది పూర్తిగా తాము అందించే ఆహారం పైనే ఆధారపడి ఉన్నారని డేవిడ్ వెల్లడించారు. ఒక వేళ నిధుల కొరత కారణంగా తాము సమయానికి వీరికి ఆహారం అందించకుంటే ఆకలి చావులు పెరిగిపోతాయని.. కరోనాను మించిన విలయాన్ని ప్రపంచం చూడాల్సి వస్తుందని డేవిడ్ హెచ్చరిస్తున్నారు.

Tags : United Nations, World Food Agency, David Beasley, Hunger Pandemic, Coronavirus

Advertisement

Next Story