కంప్యూటర్ ఆపరేటర్ల ఓవరాక్షన్‌తో.. బల్దియాలో భారీగా బదిలీలు

by Anukaran |
కంప్యూటర్ ఆపరేటర్ల ఓవరాక్షన్‌తో.. బల్దియాలో భారీగా బదిలీలు
X

దిశ, సిటీ బ్యూరో : అదనపు కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్లు, ఇంజనీర్లు, వ్యాలుయేషన్ ఆఫీసర్లు…వీరంతా ఇతర ప్రభుత్వ శాఖల్లో విభాగాధిపతులుగా విధులు నిర్వర్తించి బల్దియాకు వచ్చిన వారు. పైగా వీరు పర్మినెంట్ ఉద్యోగులు. కానీ వీరి కన్నా పెత్తనం ఎక్కువ చెలాయించేది వీరికి కింద పని చేసే ఔట్ సోర్సు కంప్యూటర్ ఆపరేటర్లు. బల్దియా ఆఫీసులన్నింటిని పేపర్ లెస్ ఆఫీసులను చేసేందుకు అమలు చేస్తున్న ఈ ఆఫీస్ ను బల్దియా కూడా అమలు చేస్తూ వీరికి కంప్యూటర్లలో ఓ కీ ని కెటాయిస్తోంది. దాన్ని కొందరు అధికారులు నేరుగా ఆపరేట్ చేయకుండా ఎంతో నమ్మకంతో వారి కింది ఉద్యోగులకు ఇస్తుంటారు. తాము అందుబాటులో లేనపుడు ఉన్నతాధికారులు అడిగే పలు ఫైళ్లను వారికి ఈ ఆఫీసులో పంపేందుకు వీలుగా ఔట్ సొర్సు ఉద్యోగులను వీరు ఇలా నమ్ముకుంటుంటారు.

అదే అదునుగా ఫైళ్ల నిర్వహణలో వీరు పలు అక్రమాలకు పాల్పడటం, అందుకు సదరు అధికారి జవాబు చెప్పుకోవటం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి సంఘటనలే ఇటీవల చార్మినార్, ఎల్బీనగర్ జోన్లలో కూడా జరిగాయి. ఇప్పటి వరకు ఈ విషయం ఘటన జరిగిన సర్కిల్ లేక జోనల్ ఆఫీసు వరకే పరిమితమైంది. కానీ చార్మినార్ జోన్ లో ఓ కంప్యూటర్ ఆపరేటర్ చేసిన ఘన కార్యంతో ఇపుడు ఆరు జోన్లు, 30 సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న సుమారు 1600 మంది కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీలకు దారి తీసింది. ఈ కంప్యూటర్ ఆపరేటర్ల లీలలు కమిషనర్ దృష్టికి వెళ్లటంతో ఒక్క ప్రధాన కార్యాలయం మినహా మిగిలిన ఆరు జోన్లలోని 30 సర్కిళ్ల కంప్యూటర్ ఆపరేటర్లందర్నీ ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్ కు బదిలీ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

బదిలీలకు మహిళా ఉద్యోగులకు మినహాయింపును కూడా ఇచ్చేది లేదని కమిషనర్ అన్నట్టు సమాచారం. గతంలో ఇదే తరహాలో జోన్ల స్దాయిలో వీరి బదిలీలు చేపట్టారు. ర్యాండమ్ పద్దతిలో చేపట్టిన ఈ బదిలీల కారణంగా ఎల్బీనగర్ జోన్ లో పని చేస్తున్న ఔట్ సొర్సు ఉద్యోగులు శేరిలింగపల్లి, కుత్బుల్లాపూర్ వంటి దూర ప్రాంతాలకు, అక్కడ పని చేస్తున్న వారికి ఎల్బీనగర్ జోన్, ఛార్మినార్ జోన్లకు బదిలీ కావటంతో వారు అనేక ఇబ్బందులయ్యారు. ప్రస్తుతం వీరిని సర్కిళ్ల స్దాయిలో బదిలీలు చేస్తున్న సర్కిల్ విస్తీర్ణం కూడా చాలా పెద్దదిగానే ఉండటంతో ఎక్కడికి బదిలీ అవుతుందోనని ఔట్ సోర్స్ ఉద్యోగుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం ఔట్ సోర్స్ మహిళా ఉద్యోగులకైనా ఈ బదిలీల నుంచి మినహాయింపునివ్వాల్సి ఉండేదని కోందరు మహిళా ఉద్యోగులు వాపోతున్నారు.

వీరి ఓవర్ యాక్షనకు బ్రేక్ ఎపుడో?

కేవలం సర్కిళ్ల స్దాయిలోనే గాక, ప్రధాన కార్యాలయంలోనూ ఓవర్ యాక్షన్ చేసే ఔట్ సోర్సు ఉద్యోగులకు ఎపుడు బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హెల్త్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలను చూసే ఔట్ సోర్సు కంప్యూటర్ ఆపరేటర్లు, టౌన్ ప్లానింగ్ విభాగంలో వివిధ జోన్లకు ఏసీపీలుగా, అదనపు సిటీ ప్లానర్లుగా విధులు నిర్వర్తించే అదికారుల వద్ద ఆపరేటర్లుగా విధులు నిర్వర్తించే వారు తమ పై అధికారి కన్నా ఎక్కవగా ఫోజులు కొడుతుంటారని అనుమతుల కోసం ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే కొందరు దరఖాస్తుదారులు వాపోయారు.

అధికారి ఈ ఆఫీస్ కీ వీరికి తెల్సి ఉండటంతో అధికారి లేని సమయంలో వీరు ఒకరి ఫైళ్లలోని ముఖ్యమైన, కీలకమైన డాక్యుమెంట్లు, ప్రతాలను ఇతర వ్యక్తులకు మెయిల్ ఫార్వర్డ్ చేయటం, లేదంటే ప్రింట్ తీసి ఇవ్వటం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరిలో మరికొందరు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి దరఖాస్తుదారులు, బిల్డర్ల వద్ద బేరసారాలు చేస్తూ అధికారులకు, దరఖాస్తుదారులకు మధ్య ఏజెంట్లుగా కూడా వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కమిషనర్ తాజాగా తీసుకున్న బదిలీల నిర్ణయం వీరికి కూడా వర్తింపజేస్తే జీహెచ్ఎంసీలోని ఔట్ సోర్సు సెక్టార్ మొత్తం ప్రక్షాళన జరిగేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story