60 వేల ఏళ్ల కిందటి నీళ్ల అడవి కాపాడాలని బైడెన్‌కి పిటిషన్

by Shyam |   ( Updated:2021-01-24 04:34:01.0  )
60 వేల ఏళ్ల కిందటి నీళ్ల అడవి కాపాడాలని బైడెన్‌కి పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్ ముందు ఎన్నో సవాళ్లుండగా, ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అత్యంత కఠినమైన సమస్య..కరోనా మహమ్మారి. దీనిని అధిగమించేందుకు బైడెన్ చేపట్టబోతున్న తక్షణ చర్య దేశంలో అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు చేయించడం. దీంతో పాటు, జాత్యహంకారం, జాతి అసమానతలు, వాతావరణ మార్పులు, పర్యావరణ భద్రత, ఆరోగ్యం పొందే హక్కు, అంతర్జాతీయ సంబంధాలను పునరిద్ధరిస్తానని జో బైడెన్ వాగ్దానం చేశాడు. ఆయన ప్రామిస్ చేసిన వాటిలో పర్యావరణ భద్రత ఒకటి కాగా, అలబామా తీరంలోని ఓ ప్రత్యేక అడవిని కాపాడాల్సిందిగా జో బైడెన్‌‌కు పర్యావరణవేత్తలు ఓ పిటిషన్ పెట్టుకున్నారు. ఆ ప్రత్యేక అడవి ఏంటి? అది ఎందుకు ప్రమాదంలో పడింది? ఆ విషయాలు మీకోసం.

60,000 ఏళ్ల క్రితం మంచు యుగాన అలబామ తీరంలో సైప్రస్ చెట్ల అవక్షేపాలతో అడవి ఏర్పడింది. ఆ తర్వాతి కాలంలో ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ సముద్రం నీటిమట్టం పెరగడంతో ఆ నీళ్లలో అడవి మునిగిపోయింది. దాంతో సహస్రాబ్దాలుగా అవక్షేపాలు, మట్టి, ఇసుక పొరల్లోనే ఆ చెట్లు బతుకుతున్నాయి. 2004లో ఇవాన్ హరికేన్ గల్ఫ్ తీరాన్ని తాకడంతో పాటు, భారీ తరంగాల ధాటికి చెట్లను కప్పి ఉంచిన అవక్షేపాలు తొలగిపోవడంతో సైప్రస్ అడవి గురించి ప్రపంచానికి తెలిసింది. 2019లో అలబామాకు చెందిన ఏఎల్.కామ్ అనే ఫర్నీచర్ కంపెనీ సముద్ర గర్భంలోని అతి పురాతనమైన చెట్ల దుంగలను సేకరించి విక్రయించాలనుకుంది. అందుకు ఆ అటవీ స్థలాన్ని 2014 నుంచి 2021 వరకు తవ్వటానికి అనుమతి కోరుతూ.. అలబామా ఒకటవ కాంగ్రెస్ జిల్లాకు యూఎస్ ప్రతినిధిగా పనిచేసిన బ్రాడ్లీ బైర్నీ‌కి దరఖాస్తు చేసింది. కాగా, ఈ ఫారెస్ట్ కాపాడటం కోసం ‘అలబామా అండర్ వాటర్ ఫారెస్ట్ నేషనల్ మెరైన్ శాంక్చురి అండ్ ప్రొటెక్షన్ యాక్ట్’ అక్టోబర్ 27, 2020న కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టాడు బైర్నీ. ఈ యాక్ట్ ప్రకారం పర్యాటకులు, మత్స్యకారులు, పరిశోధనా బృందాలు మాత్రమే ఆ అడవిని సందర్శించడానికి మాత్రమే అనుమతి ఉంది. పీట్ (కుళ్లిన, లేదా ఎండిపోయిన), కలప తీసుకెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు.

‘అలబామా అండర్ వాటర్ ఫారెస్ట్ నేషనల్ మెరైన్ శాంక్చురి అండ్ ప్రొటెక్షన్ యాక్ట్’ బిల్లును సహజ వనరుల హౌస్ కమిటీకి పంపగా అక్కడ అది పెండింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌లో బైర్నీ పదవీకాలం జనవరి 3తో ​​ముగియడంతో, ప్రస్తుతం అతని స్థానంలో జెర్రీ కార్ల్ ఉన్నారు. బైడెన్ ప్రభుత్వం ‘పారిస్ క్లైమెట్’ అగ్రిమెంట్‌ను తిరిగి ఆమోదించగా, ‘కీస్టోన్ ఎక్స్‌ఎల్ ఆయిల్ పైప్‌లైన్స్ ఫెడరల్ పర్మిట్‌’ను ఉపసంహరించుకుంది. తద్వారా పర్యావరణ వ్యవస్థ, వాతావరణం, తాగునీటికి ఇది ముప్పుగా పరిమణించనుందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘అలబామా అండర్ వాటర్ ఫారెస్ట్ నేషనల్ మెరైన్ శాంక్చురి అండ్ ప్రొటెక్షన్ యాక్ట్’ను ఆమోదించాలని కోరుతూ కొత్త ప్రభుత్వానికి పర్యావరణవేత్తలు పిటిషన్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ ఆ బిల్లును ఆమోదిస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను’ అని రిపబ్లిక్ బైర్నీ చెప్పారు.

సెప్రస్ అడవిలో మొత్తం 300కు పైగా జంతువులున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అక్కడ పెరిగే బ్యాక్టీరీయా, చెదపురుగులు ఫుడ్ చెయిన్‌కు తోడ్పడతాయని, ఆ ప్రాంతంలోని బ్యాక్టీరీయా ఔషధాల తయారీలో ఉపయోగించేందుకు అనువుగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అంతేకాదు కాగితం, వస్త్రాలు, పశుగ్రాసాలు, పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తిలో వాటిని వినియోగించుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed