కరోనా మృతుల సంఖ్యపై చైనాకు డబ్ల్యూహెచ్ఓ బాసట

by vinod kumar |
కరోనా మృతుల సంఖ్యపై చైనాకు డబ్ల్యూహెచ్ఓ బాసట
X

న్యూఢిల్లీ : కరోనా మృతుల సంఖ్య సరవణపై చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బాసటగా నిలిచింది. కరోనా మరణాల సంఖ్యను గురువారం చైనా సవరించిన సంగతి తెలిసిందే. గతంలో కంటే 40శాతం మృతుల సంఖ్యను పెంచి చూపెట్టింది. దీనికి పలు కారణాలు చెప్పుకొచ్చింది. అయితే, ఈ సవరింపును డబ్ల్యూహెచ్ఓ సమర్థించింది. మరణాల సంఖ్యను సవరించే విషయంలో ప్రపంచ దేశాలు కూడా చైనాను అనుసరించక తప్పదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తీవ్రంగా విజృంభిస్తోందని.. దీని ప్రభావం తగ్గిన తర్వాత అన్ని దేశాలు మరణాల సంఖ్యను సవరించక తప్పదని.. కచ్చితంగా ఆయా దేశాలు మరణాలను పెంచి చెబుతాయని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ప్రస్తుతం వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఎవరికి కరోనా సోకింది? ఎవరు కరోనాతో మృతి చెందారనే పూర్తి వాస్తవ సంఖ్యను నమోదు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ప్రస్తుతం అంచాలు మాత్రమే నమోదు చేస్తారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఒక్క సారి వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత అన్ని దేశాలు మరో సారి తమ డేటాను చెక్ చేసుకొని పూర్తి వివరాలు వెల్లడించక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ 19- టెక్నికల్ లీడ్ మారియా కెర్ఖోవ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో అన్ని కేసులూ నమోదవుతున్నాయని.. కరోనా కారణంగా ఇండ్లలో.. ఇతర ప్రదేశాల్లో మరణించే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఆయా వివరాలు ఆస్పత్రుల వద్ద కాకుండా స్థానిక సంస్థలు, ప్రభుత్వాల వద్ద నమోదైన వివరాలను కూడా క్రోడీకరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు వూహాన్‌లో కరోనా తీవ్ర రూపం దాల్చిన సమయంలో ఆస్పత్రులన్నీ కిక్కిరిసి పోయారు. కొంత మంది ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాత్కాలిక ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు రోగుల చికిత్సలో నిమగ్నమయ్యారు తప్ప వివరాలు నమోదు చేయలేదు. అందుకే చైనా ఇప్పుడు డేటా అంతటినీ సేకరించి మరణాల సంఖ్యను సవరించిందని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. కాగా, డబ్ల్యూహెచ్‌ఓ ప్రతి విషయంలో చైనాను వెనకేసుకొని రావడంపై అమెరికా విరుచుకుపడుతున్నది. ఇప్పటికే మరణాల సంఖ్యపై చైనా అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చైనా మరణాలను పెంచడం, డబ్ల్యూహెచ్‌ఓ దానికి మద్దతు పలకడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

Tags: coronavirus, china, fatalities, count, WHO, cases, revised

Advertisement

Next Story