కొడుకు సీటు కోసం ఏ ఎమ్మెల్యేకు చెక్‌ పెడుతారో.. ఆ మంత్రి…?

by Shyam |   ( Updated:2021-07-01 06:34:24.0  )
trs-flag 1
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదని జగమేరిగిన సత్యం. ఇలాంటి సమయంలో ఎన్నికలకు ముందుగానే నాయకులు పోటీ చేసే స్ధానాలను పదిలపర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని మంత్రి తనయుడు వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారోననే చర్చ సాగుతుంది. ఆయన రాకతో ఏ ఎమ్మెల్యేకు చెక్ పెడుతారోనని పార్టీ వర్గాలు విశ్లేశిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలోనున్న ఆ నేతలు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్‌లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున 2014 సాధరణ ఎన్నికల్లో ఆ నేత బరిలో నిలిచాడు. చేవెళ్ల పార్లమెంట్ టికెట్ దక్కించుకొని మూడోవ స్ధానంతో సరిపెట్టుకున్నారు.

ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక్కరికే టికెట్ అని చెప్పడంతో తనయుడి కోసం తల్లి పోటీకి దూరమైంది. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో తనయుడు వెనక్కి తగ్గి తల్లి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గేందుకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అధినేత ఆహ్వానించారు. అందుకు ఆ ఎమ్మెల్యేలు అంగీకరించి కొన్ని కండీషన్లతోనే టీఆర్ఎస్‌లో చేరారనే ప్రచారం సాగింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాకు చెందిన సదురు మంత్రి, మంత్రి తనయుడు టీఆర్ఎస్‌లో చేరడం జరిగినట్లు అప్పుడు వార్తలు గుప్పుమన్నాయి.

మంత్రి పదవితో పాటు తనయుడికి రాజకీయ భవిష్యత్తు కల్పించాలని కోరినట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల బరిలో మంత్రి తనయుడి పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానం అతనికేనని పుకార్లు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఆ నేతకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

డైలామాలో మంత్రి తనయుడు…

ఇదే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగి పోటీ చేయాలంటే ఏ ఎమ్మెల్యేకు చెక్ పెడతారనే చర్చ నడస్తుంది. అయితే తన తండ్రి పాత నియోజకవర్గమైన చేవెళ్ల నుంచి అనేక సార్లు పోటీ చేసి గెలిచారు. ఆ నియోజకవర్గం విభజనలో భాగంగా చేవెళ్ల, రాజేంద్రనగర్ లుగా విడిపోయాయి. చేవెళ్ల ఎస్సీ రిజర్వ్డ్‌గా, రాజేంద్రనగర్ జనరల్ స్ధానాలుగా కేటాయించారు. జనరల్ స్థానమైన రాజేంద్రనగర్ నుంచే ఆ నేత పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విశ్వ ప్రయాత్నాలు చేశారు.

కానీ తల్లి మహేశ్వరం నుంచి బరిలో ఉండటంతో తనయుడుకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటే ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టినట్లేనా అనే ప్రచారం సాగుతుంది. లేకపోతే పార్లమెంట్ అభ్యర్ధిగా రేసులో ఉంటే రంజిత్ రెడ్డిని తప్పలించాల్సి ఉంటుంది. అసలు ఈ పార్టీ నుంచి అవకాశం లేకపోతే మరోపార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుంటారని స్ధానిక నాయకులు అంటున్నారు.

ఇద్దరికి అవకాశం లభించేనా…?

కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ అవకాశం ఇస్తామని చెప్పడంతో ఆ సమయంలో పోటీకి మంత్రి దూరమైయ్యారు. మరోసారి అవకాశం వస్తోందని అనుకున్న తరుణంలోనే పార్టీ మారాల్సి వచ్చింది. దీంతో తనయుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నర్ధాకంగా మిగిలిపోయింది. రాబోయే ఎన్నికల్లో ఏ స్ధానం నుంచి పోటీ చేయాలో తెలియక సందిగ్ధంలోనున్నారు. ఒకవేళ అవకాశం వస్తే ఆ కుటుంబంలోని ఇద్దరికి టికెట్ ఇస్తారా అనేది అనుమానంగానే ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు రాజకీయాలను ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి ముగ్గురి తనయుల్లో ఒకరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో తిరుగుతున్నారు. రెండో కుమారుడు తల్లి వెంట మహేశ్వరం నియోజకవర్గం మొత్తం తిరుగుతుండటంతో కార్యకర్తల్లో ఆలోచన మొదలైయింది. భవిష్యత్తు రాజకీయాల కోసం ఇప్పటి నుంచే మంత్రి తనయులు బాటలు వేసుకుంటున్నారు.

Advertisement

Next Story