ఐపీఎల్ కష్టం.. తప్పదా నష్టం !

by Shyam |
ఐపీఎల్ కష్టం.. తప్పదా నష్టం !
X

కరోనా వైరస్ భారత్‌లోనూ వ్యాపిస్తున్న నేపథ్యంలో క్రీడా రంగానికి సంబంధించిన పలు మెగా టోర్నీలను ఇప్పటికే రద్దు చేస్తున్నారు. కాగా బీసీసీఐకి కామధేనువు లాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)ను రద్దు చేసేందుకు మాత్రం బోర్డు సంకోచిస్తోంది. భారీ నష్టాలే ఇందుకు కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందనే భయం కూడా బీసీసీఐని వెంటాడుతుండటం గమనార్హం.

బీసీసీఐ బోర్డు పెద్దలు, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, ఫ్రాంచైజీ ఓనర్లు శనివారం సమావేశమయ్యారు. ఐపీఎల్‌ను నిర్వహించేందుకు సాధ్యపడే అన్ని అవకాశాలను పరిశీలించారు తప్ప రద్దు చేయాలనే ఆలోచన ఎవరికీ రాకపోవడం వెనుక ఆర్థిక నష్టాల భయమే కారణమని తెలుస్తోంది. ఐపీఎల్‌ను ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తే బ్రాడ్ కాస్టర్, ఫ్రాంచైజీ ఓనర్లకు రూ. 3000 నుంచి రూ. 3500 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా వేశారు. అందుకే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిడివి తగ్గించైనా ఐపీఎల్‌ను నడిపిద్దామని వ్యాఖ్యానించారు. ఆటగాళ్లు, ప్రమోషన్లపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మొత్తానికే ఐపీఎల్ రద్దు చేస్తే ఆర్థికంగా దెబ్బే అని.. అంతర్గత చర్చల్లో ఏకాభిప్రాయన్ని వెలిబుచ్చారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా.. ఆర్థిక నష్టాలను మేం పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించినా.. అది పూర్తి స్థాయిలో నిజం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ప్రేక్షకులను అనుమతించకుండా.. విదేశీ ఆటగాళ్లతో కలిపి ఈ సారి ఐపీఎల్ ఆడిస్తే కొంత మేర నష్టాలను నివారించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో రెండు గ్రూపులుగా టీమ్‌లను విభజించి త్వరగా ఐపీఎల్ పూర్తి చేస్తే బాగుంటుందని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. మరోవైపు ప్రేక్షకులు, ఆటగాళ్ల ఆరోగ్యాలను పణంగా పెట్టి, డబ్బు కోసం లీగ్‌ను నిర్వహిస్తారా అనే విమర్శలు కూడా ఐపీఎల్‌ను చుట్టుముడుతున్నాయి. దీంతో ఏప్రిల్ 15 తర్వాత కూడా ఐపీఎల్ నిర్వహణ కష్టసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: IPL, BCCI, Coronavirus, Franchises, Crores of money, Cricket Analysts

Advertisement

Next Story