బంతి బరువును ఒకవైపు పెంచితే సరి : వార్న్

by Shyam |
బంతి బరువును ఒకవైపు పెంచితే సరి : వార్న్
X

మెల్‌బోర్న్: సాధారణంగా బౌలర్లు బౌలింగ్ చేసేటపుడు సరైన స్వింగ్ రాబట్టేందుకు ఉమ్మి, చెమటను బంతిపై రాసి మెరుపును తెప్పిస్తుంటారు. ఆట కొనసాగే కొద్దీ బంతి పాతబడకుండా ఈ టెక్నిక్‌ను వందల ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా వ్యాపి కారణంగా ఈ సాంప్రదాయాన్ని రద్దు చేయాలని, దాని బదులు అంపైర్ల సమక్షంలో ఇతర పద్ధతుల ద్వారా బంతికి మెరుపును తెచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదించింది. కాగా, చాలా మంది క్రికెటర్లు పాత పద్ధతికే మద్దతు పలికారు. అయితే తాజాగా ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం చూపించారు. స్వింగ్ రాబట్టడంతో పాటు బాల్ ట్యాంపరింగ్‌ను శాశ్వతంగా నిర్మూలించడానికి బరువైన బంతులు వాడితే సరిపోతుందని అంటున్నాడు. ‘ఎక్కువగా స్వింగ్ అవ్వాలంటే.. బంతి బరువును ఒకవైపు పెంచితే సరిపోతుంది కదా’ అని అంటున్నాడు.

‘అందరూ వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లా బంతిని స్వింగ్ చేయలేరు. అదే ఒకవైపు బరువున్న బంతులు వాడితే టెస్టు మ్యాచ్ రెండు, మూడో రోజులోనూ స్వింగ్ రాబట్టవచ్చని’ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, ఈ బరువైన బంతులు వాడటం వల్ల ఫ్లాట్ పిచ్ మీద సైతం బంతిని స్వింగ్ చేయవచ్చని వెల్లడించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన పరిష్కారం తప్ప.. స్వింగ్ కోసం అక్రమ పద్ధతుల్లో సీసా మూతలతో గీకడం, శాండ్ పేపర్‌తో రుద్దడం వంటివి చేయాల్సిన అవసరం లేదని వార్న్ తెలిపాడు.

Tags: Cricket, Swing, Ball Tampering, Shane Warne, ICC, Heavy Weight, Balls

Advertisement

Next Story

Most Viewed