గల్లీలో కాదు ఢిల్లీలో కూర్చోవాలి: ఎమ్మెల్యేలు

by Shyam |
గల్లీలో కాదు ఢిల్లీలో కూర్చోవాలి: ఎమ్మెల్యేలు
X

దిశ ప్రతినిధి, వరంగల్: బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, ధర్మారెడ్డి విమర్శించారు. శనివారం హన్మకొండ బాలసముద్రంలోని‌ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బండి సంజయ్, అరవింద్ గల్లీలో కాకుండా ఢిల్లీలో కూర్చొని రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలన్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. ఇటీవల దేశంలోనే అత్యధిక వర్షపాతం వరంగల్ లో నమోదుకావడంతో వరదలు వచ్చాయన్నారు. దీంతో 12 వందల కుటుంబాలు రోడ్డునపడ్డాయని మంత్రి కేటీఆర్ వరంగల్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ. 25 కోట్లు ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని శుక్రవారం జీడబ్ల్యూఎంసీ మీటింగ్ లో తీర్మానం చేసినట్లు చెప్పారు.

అక్రమాల జంగా

కాంగ్రెస్ నాయకుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని పరకాల‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. గీసుగొండ కొనాయిమాకుల లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రూ. 4 కోట్ల పనుల్లో ఎలాంటి పనులు చేయకుండానే రూ. 2 కోట్లు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ విమర్శించారు. జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 19 కేసులు పెట్టినట్లు ఆయన తెలిపారు. డీసీసీబీ చైర్మన్ గా ఉండి బ్యాంకును అప్రతిష్ఠ పాలు చేశారని ఆరోపించారు. జంగా రాఘవరెడ్డి దయాకర్ రావు పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. డీసీసీబీ చైర్మన్ గా పూర్తి కాలం ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు. మంత్రి దయాకర్ రావు మచ్చలేని నాయకుడని, రాజకీయంగా ఎదగలేక ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed