బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇద్దరు టీఎంసీ అభ్యర్థులపై దాడి

by Anukaran |   ( Updated:2021-04-06 02:32:44.0  )
బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇద్దరు టీఎంసీ అభ్యర్థులపై దాడి
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడో విడత పోలింగ్‌లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. రెండో విడత పోలింగ్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. తాజాగా, ఏకంగా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు జరిగాయి. ఈ రోజు ఉదయం ఆరంబాగ్ నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఎంసీ అభ్యర్థి సుజాత మొండల్‌పై బీజేపీ మద్దతుదారులు దాడికి దిగారు. ఈ దాడిలో ఆమె సెక్యూరిటీ సిబ్బందీ గాయపడ్డారు. కాగా, ఖానకుల్ స్థానం నుంచి పోటీ చేస్తు్న్న టీఎంసీ అభ్యర్థి నజీబుల్ ఖాన్‌పైనా దాడి జరిగింది. గౌరంగో చౌక్ దగ్గర బీజేపీ మద్దతుదారులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. అదే స్పాట్‌లో ధర్నాకు దిగారు.

హుగ్లీ జిల్లాలోని గోఘట్ నియోజకవర్గంలో పోలింగ్‌కు ఒకరోజు ముందు రాత్రి దాడులు జరిగాయి. తన కొడుకును రక్షించుకునే క్రమంలో ఓ మహిళ మరణించారు. బీజేపీ మద్దతుదారుడుగా చెప్పుకుంటున్న ఆమె కొడుకు, సోమవారం రాత్రి జరిగిన దాడి తృణమూల్ కార్యకర్తలే చేశారని ఆరోపించారు. ఈ ఘటన వివరాలు పోలింగ్ మొదలైన వెంటనే బయటకు వచ్చాయి. కాన్నింగ్ పుర్బా అసెంబ్లీ సెగ్మెంట్‌లో కొందరు దుండగులు క్రూడ్ బాంబులను విసిరారు. ఇందులో ఒకరు గాయపడ్డారు. ఇది ఐఎస్ఎఫ్ కార్యకర్తల పని అని టీఎంసీ క్యాండిడేట్ షౌకత్ మొల్లాహ్ ఆరోపించారు. పోలింగ్ బూత్‌కు వెళ్లవద్దని, ఓటు వేయవద్దని టీఎంసీ కార్యకర్తలు సోమవారం రాత్రి తమను బెదిరించారని సౌత్ 24 పరగణాలు, హౌరాలోని బఘ్నాన్‌కు చెందిన గ్రామస్తులు ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story