ఆ బ్యాక్ డ్రాప్ లో మహేష్- రాజమౌళి సినిమా.. ఫ్యాన్స్ కి పండగే

by Shyam |   ( Updated:2021-07-06 05:12:30.0  )
mahesh - rajamouli news
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి అంటే అతిశయోక్తి కాదు. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాను నిలబెట్టిన సత్తా దర్శక ధీరుడిది. ఇక ఆయన వెన్నంటి ఉండి అలాంటి కథలను రాసే రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు కూడా ఈ విజయం దక్కుతుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో మరోసారి ఈ తండ్రీకొడుకుల పేరు మారుమ్రోగిపోతుంది. ఇంకా విడుదల కానీ చిత్రానికే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న అభిమానులు ఇక రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రం తర్వాత జక్కన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అందరికి భారీ అంచనాలే మొదలయ్యాయి. ఇక వీటికి తోడు తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే కథ ఎలా ఉంటుంది అనేదాని మీద విజయేంద్ర ప్రసాద్ నోరు విప్పారు. మహేష్ కోసం ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నారని.. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు.

ఇటీవల ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ “మహేష్ బాబు సినిమా పనులు జరుగుతున్నాయి. కొన్ని ఐడియాలు అనుకుంటున్నాం. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అదెలా చేయగలమని ఆలోచిస్తున్నాం. దాని మీద కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంది” అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహేష్ పురాణాలు, చారిత్రాత్మక కథలు తనకు సెట్ కావని చాలాసార్లు చెప్పారని, అందుకోసమే ఆయన కోసం ఒక ప్రత్యేకమైన కథను రాస్తున్నట్లు తెలిపారు. ఇక రాజమౌళి, మహేష్ కోసం ఒక జేమ్స్ బాండ్ తరహాలో కథ రాసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక వేళ ఈ జంగిల్ అడ్వెంచర్ స్టోరీ కనుక కుదరకపోతే రాజమౌళి జేమ్స్ బాండ్ కథతోనే ముందుకెళ్లనున్నాడని తెలుస్తోంది.

Advertisement

Next Story