ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు విజిలెన్స్ బృందాలు

by Shyam |
Mareddy Srinivas Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా రైతులకు చెల్లింపులు జరపాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై గురువారం పౌరసరఫరాల భవన్ లోని చైర్మన్ కార్యాలయంలో ప్రొక్యూర్ మెంట్, ఫైనాన్స్, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. చెల్లింపుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.20వేల కోట్లను సీఎం కేసీఆర్ సమకూర్చారని, ఎలాంటి నిధుల కొరత లేకున్నా క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారుల నిర్లక్ష్యంతో చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందన్న ఫిర్యాదులపై ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిపారు. రెండుమూడ్రోజుల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అధికారుల అలసత్వంతో రైతులు ఇబ్బందులకు గురైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలస్యంగా చెల్లింపులు జరుగుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టిసారించామని, ఇందుకోసం పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? ఓపీఎంఎస్ నమోదు చేశారు, రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఓపీఎంఎస్ నమోదులో ఎదురవుతున్న సమస్యలు, ఆలస్యానికి గల కారణాలు.. కొనుగోలు చేసిన ధాన్యంలో ఎంత ధాన్యం మిల్లులకు తరలించారు.. ఏయే మిల్లుల్లో మిల్లర్ అక్నాలెడ్జ్ సమస్య ఉంది… సమస్య ఉన్న మిల్లులను విధిగా సందర్శించడం.. చెల్లింపుల ఆలస్యానికి కారణాలపై విశ్లేషణ, చెల్లింపులను వేగవంతం చేయడానికి చేపడుతున్న చర్యలను ఈ బృందాలు సమీక్షిస్తాయని తెలిపారు.

చెల్లింపుల్లో జాప్యం జరిగితే చర్యలు

కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో నమోదు చేయాలని చైర్మన్ ఆదేశించారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకొని వివరాలను ట్రక్ షీట్ లో నమోదు చేయాలని, జాప్యం జరిగితే దాని ప్రభావం మద్దతు ధర చెల్లింపులపై పడుతుందన్న విషయాన్ని గుర్తించి అధికారులు పనిచేయాలని సూచించారు. దిగుమతి చేసుకున్న ధాన్యానికి మిల్లర్ అక్నాలెడ్జ్ ఇవ్వకుండా జాప్యం చేస్తే దానికి జిల్లా మేనేజరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రైతులకు చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతాంగం అభివృద్ధికి కేసీఆర్ ఇస్తున్న ప్రధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా అధికారులను పనిచేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story