మెడికల్ కాలేజీలతో ప్రభుత్వం కుమ్మక్కు : వంశీచంద్ రెడ్డి

by Shyam |   ( Updated:2020-05-07 09:14:41.0  )
మెడికల్ కాలేజీలతో ప్రభుత్వం కుమ్మక్కు : వంశీచంద్ రెడ్డి
X

దిశ,న్యూస్‌బ్యూరో: వైద్యవిద్య ఫీజులను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమైనదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి హెచ్చరించారు. మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ పెద్దలు చేతులు కలిపి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గురువారం ఈ విషయమై వంశీచంద్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ.. పెంచిన ఫీజులతో మధ్య తరగతి విద్యార్థులు మెడిసిన్ చదవాలన్న ఆలోచన మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. పేద విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల ఫీజుల పెంపుతో వైద్యం చాలా ఖరీదు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో డాక్టర్లు కష్టపడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మెడికల్, డెంటల్ పీజీ సీట్ల ఫీజును రెండింతలు పెంచడం బాధాకరమన్నారు. రూ.3.75లక్షలు ఉన్న పీజీ సీటు ఫీజు పెంపుతో రూ.7లక్షలు అయిందన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఏడాదికి రూ.7 లక్షలు ఎట్లా చెల్లించాలని వంశీచంద్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన ఫీజులను తగ్గించే వరకూ ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు పోరాటం చేయాలని వంశీచంద్ రెడ్డి పిలుపు నిచ్చారు.

Tags: Medicine, Fees, Vamsi Chander Reddy, Students

Advertisement

Next Story

Most Viewed